మొయినాబాద్ (చేవెళ్ల): హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు డబ్బుకోసం ఓ మత ప్రచారకుడికి వలవేశారు. అతడిని నమ్మించి డబ్బులు తీసుకున్నారు. భోజనం కోసం అంటూ పిలిచి జూస్‌లో మత్తుమందు కలిపారు. అనంతరం అసభ్యకరంగా ఉన్న ఫొటోలు తీసి రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌లోని ఓ మత ప్రచారకుడి వద్దకు గత ఆగస్టు 11న ఓ మహిళ(23) వచ్చింది. తన ఆరోగ్యం బాగలేదని తనకోసం ప్రార్థనలు చేయాలని అతడిని కోరింది. అలా పరిచయం ఏర్పరచుకుని తాను ఓ అనాథాశ్రమం నడుపుతున్నట్లు చెప్పింది. ఆయన ఫోన్‌నంబర్ తీసుకుని వాట్సప్ చాటింగ్ చేసేది.
కొన్నాళ్ల తర్వాత శంషాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు, మరోసారి వండర్‌లాకు పిలిచి అతనితో సెల్ఫీలు దిగింది. తన భర్త విజయవాడలో ఓ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, పెట్టుబడిగా సాయం కావాలని రూ.10 లక్షలు తీసుకుంది. వ్యాపారం పేరుతో బాధితుడిని పిలిచి తమ పథకం అమలుచేసి అతడిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.కోటికి ఒప్పందం రాయించుకొని రూ.10 లక్షలు గుంజారు. వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిందని, ఆమె భర్త హైదరాబాద్‌లో హోటల్ వ్యాపారం నడిపి నష్టపోయారని పోలీసులు గుర్తించారు. వారిని సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment