అవి‘నీటి’కి లైన్‌క్లియర్!
సిరిసిల్ల మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.80 కోట్లతో చేపట్టాల్సిన తాగునీటి పైపులైన్ పనులకు టెండర్ల దశలోనే అవి‘నీటి’ లీకేజీలు ఏర్పడ్డాయి. నాణ్యత ప్రమాణాలతో పదికాలాలపాటు నిలిచేలా పనులు నిర్వహించాల్సి ఉండగా... కొంతమంది కౌన్సిల్ సభ్యులు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు పుచ్చుకొని నిబంధనలకు విరుద్ధంగా దాఖలైన టెండర్లను ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది.
సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ హైస్కూల్ నుంచి తుమ్మలకుంట చెరువు వరకు ప్రధాన మురికికాలువ నిర్మాణానికి రూ.26.31 లక్షలతో టెండర్లు నిర్వహించగా, 26.55 శాతం తక్కువకు కోడ్ చేసిన శ్రీహనుమాన్ వడ్డెర సంఘానికి పని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శాంతినగర్, వెంకట్రావునగర్, అంబేద్కర్‌నగర్ అంతర్గత హెచ్‌డీపీఈ పైపులైన్ కోసం రూ.21.80 లక్షలతో టెండర్లు పిలిచారు.
ఈ పనిని 15.20 శాతం తక్కువకు సత్యం సిమెంట్ పైప్స్ కంపెనీకి అప్పగించేందుకు టెండర్లు ఓకే చేశారు. సాయినగర్ వాటర్ ట్యాంక్ నుంచి తుక్కారావుపల్లి, గణేశ్‌నగర్, తారకరామనగర్‌లో పైపులైన్ వేసేందుకు రూ.40.51 లక్షలతో టెండర్లు పిలువగా 15.40 శాతం తక్కువ కోడ్ చేసిన సత్యం సిమెంట్ పైప్స్ కంపెనీకే ఓకే చేస్తూ మున్సిపల్ ఏజెండాలో పేర్కొన్నారు.
పట్టణంలోని గణేశ్‌నగర్, జేపీనగర్, తుక్కారావుపల్లి, అంబికానగర్, లలితానగర్, తారకరామనగర్ ప్రాంతాల్లో పైపులైన్ నిర్మాణం కోసం రూ.20 లక్షలతో టెండర్లు పిలవగా 18.10 శాతం తక్కువకు వేసిన మహేశ్వరి పాలిమర్స్‌కు టెండర్ ఓకే చేశారు. మొత్తం వ్యవహారంలో కౌన్సిల్ ముఖ్య నాయకులకు ముందే రూ.10 లక్షలు ఇవ్వాలన్న ఒప్పందం మేరకు టెండర్లు ఖరారు చేసినట్లు ఆరోపణలున్నాయి.
లోగుట్టు ఇదీ...
ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలువగా అక్టోబర్ 31లోగా టెండర్లు దాఖలు చేయాలి. నవంబర్ 1న టెండర్లు ఓపెన్ చేయాలి. నిబంధనల ప్రకారం టెండర్లు తెరిచేలోగా ఈఎండీ, ప్రాసెసింగ్ ఫీజు డీడీ చెల్లించిన కాంట్రాక్టర్ల టెండర్లు మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉండగా, కౌన్సిల్ కోరుకున్న వ్యక్తులు ఆ నిబంధనల ప్రకారం డీడీలు కట్టలేదు.
స్థానిక కాంట్రాక్టర్ ఒకరు డీడీలు చెల్లించి పనులు చేసేందుకు సిద్ధంగా ఉండగా, మున్సిపల్‌లోని కీలక నాయకులు సదరు కాంట్రాక్టర్‌ను మున్సిపాలిటీకి పిలిచి టెండర్ వాపస్ తీసుకోవాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో డీడీ చెల్లించని కాంట్రాక్టర్లతో డీడీలు తెప్పించుకొని టెండర్‌ను ఓకే చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో పైపులైన్ లీకేజీలతో పట్టణ నీటి సరఫరా వ్యవస్థ గందరగోళంగా మారింది. కొత్తగా వేసే పైపులైన్లలోనూ మున్సిపల్ కౌన్సిల్ కాసుల కోసం కక్కుర్తిపడి నిబంధనలు పాటించని వ్యక్తులకు పైపులైన్ పనులు అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.
కౌన్సిలర్ల మధ్య కలహాలు
పైపులైన్ టెండర్లకు సంబంధించి ఒప్పందం చేసుకున్న రూ.10 లక్షల పంపిణీ వ్యవహారం కౌన్సిలర్ల మధ్య కలహాలకు దారి తీసింది. ఈ డబ్బులను కౌన్సిల్‌లోని ముఖ్యనాయకులు ఇద్దరితోపాటు మరో సీనియర్ కౌన్సిలర్, ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య కౌన్సిలర్లకు వాటాలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
ఐదుగురు ముఖ్య నాయకులకే వాటాలు ఇచ్చి ఈ మేరకు ఈ నెల 29న నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టెండర్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపేలా రంగం సిద్ధమైంది. విషయం తెలుసుకున్న మిగతా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తమకూ వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. కీలక కౌన్సిలర్లు అందుకు నిరాకరించారని, పైపులైన్ పనులు పూర్తయ్యాక వచ్చే కమీషన్‌ను వారికి పంపిణీ చేస్తామని సముదాయించినట్లు తెలిసింది.
ఈ ఒప్పందాన్ని నిరాకరించిన మెజారిటీ కౌన్సిలర్లు రెండురోజుల కిందట ఓ కౌన్సిలర్ ఇంట్లో సమావేశమై టెండర్లు ఆమోదం పొందకుండా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా పైపులైన్ నిర్మాణానికి ముందే ముడుపుల లీకేజీలు సిరిసిల్ల కౌన్సిల్‌లో రగడకు కారణమయ్యాయి. ఈ విషయంలో కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
నిబంధనల ప్రకారమే టెండర్లు - సుమన్‌రావు, మున్సిపల్ కమిషనర్
13వ ఆర్థిక సంఘం నిధులతో పైపులైన్ కోసం పిలిచిన టెండర్లు నిబంధనల మేరకే జరిగాయి. జీవో ప్రకారం ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచాం. తక్కువ పర్సెంట్‌కు టెండర్ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించేందుకు కౌన్సిల్ ఆమోదానికి పెట్టాం. రూ.11.58 లక్షల మేర తక్కువ మొత్తానికే టెండర్లు ఒకే చేశాం.