
డిజైనర్ల కలల చిరునామా లాంటి ఫ్యాషన్ వేదికపై సిటీ మరోసారి తళుక్కుమంది. నగరానికి చెందిన డిజైనర్లు,సెలబ్రిటీలు ముంబైలో కొలువుదీరారు. దేశవ్యాప్తంగా డిజైనర్లు, స్టైల్ లవర్స్‌తో కళకళలాడే ఈ అగ్రగామి ఫ్యాషన్ వేడుకలో.. గత కొంతకాలంగా తనదైన సత్తాచాటుకుంటున్న సిటీ ఈసారి కూడా మెరుపులు మెరిపించింది. ముంబైలోని జియోగార్డెన్స్‌లో తాజాగా ముగిసిన స్ప్రింగ్‌సమ్మర్ ఫ్యాషన్ వీక్ విశేషాలలో భాగ్యనగరభాగస్వామ్యంపై ఓ ‘లుక్’ వేద్దాం.
డిజైనర్ ఫ్రెండ్లీ..సమ్మర్ ట్రెండీ..
చలికాలం ముగుస్తున్న దశలో వేసవికి ముందుగా వచ్చేదే స్ప్రింగ్ సమ్మర్ సీజన్. రానున్న వేసవిలో డిజైనర్లు సరికొత్త ఆవిష్కరణలతో ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కదం తొక్కించే సమయం ఇది. దీనిని పురస్కరించుకుని లాక్మె స్ప్రింగ్ సమ్మర్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. దీనిలో పాల్గొని తమ తమ డిజైన్లను ప్రదర్శించమని దేశవ్యాప్తంగా ఉన్న డిజైనర్లను ఆహ్వానించింది. అయితే పోటాపోటీ ఎంట్రీల మధ్య మన నగరం నుంచి నలుగురు డిజైనర్లు ఈ వీక్‌కు హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు. దేశవ్యాప్త డిజైనర్లతో పోటీపడి తమదైన శైలిలో స్ప్రింగ్ సమ్మర్ ట్రెండ్స్‌ను ప్రదర్శించారు.
డిజైనర్స్‘ఫోర్స్ ఇదే..
నగరం నుంచి అనుశ్రీరెడ్డి, శైలేష్ సింఘానియా, మిశ్రి సహా నలుగురు డిజైనర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గతంలోనూ లాక్మె వేదికపై రాణించిన అనుభవం ఉన్న శైలేష్ సింఘానియా మరోసారి తన సహానా కలెక్షన్‌లతో ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆయన కలెక్షన్లకు షోస్టాపర్‌గా జన్మతః హైదరాబాదీ అయినా బాలీవుడ్ నటి ఆదితి హైదరి వ్యవహరించారు. ‘నా ప్రదర్శనకు అద్భుతమైన స్పందన
వచ్చింది. నేను పాల్గొన్నది కూడా ఈవెంట్‌కి చివరి రోజు కావడంతో ఫ్యాషన్ ప్రియులు మరింత అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాదీ డిజైనర్లకు గతంతో పోలిస్తే లాక్మె వీక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది’ అని శైలేష్ చెప్పారు. నగరం నుంచి లాక్మె అవకాశం దక్కించుకునే వారిలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న డిజైనర్ అనుశ్రీరెడ్డి కూడా తనదైన శైలి మెరుపుల్ని మెరిపించారు. ఆమె మరో డిజైనర్ నిఖిల్ తంపితో కలిసి తొలిసారిగా కంబైన్డ్ షోని సమర్పించడం విశేషం. సిటీ డిజైనర్ అనుశ్రీరెడ్డి తీర్చిదిద్దిన కలెక్షన్లకు షో స్టాపర్‌గా బాలీవుడ్ ‘మణికర్ణిక’ కంగనా రనౌత్ ర్యాంప్‌పై తళుక్కుమన్నారు. నగరానికే చెందిన మరో డిజైనర్ స్వప్న అనుమోలు తన లేబుల్ రిమైన్స్ పేరిట మరో ఇద్దరితో కలిసి తన కలెక్షన్‌ను ప్రదర్శించారు. ఈ కలెక్షన్‌కు జత చేసిన ఆర్ట్ వర్క్‌లో ఆమె సిటీకి చెందిన విశేషాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఆమె డిజైన్లకు షోస్టాపర్‌గా బాలీవుడ్ నటి డయానా పెంటీ వ్యవహరించారు. ఇక నగరానికి చెందిన శ్రియా సోమ్ ‘రివెరీ’ పేరుతో ఆకట్టుకునే ఆకులు, పువ్వులు, సూర్యకాంతి, సముద్రపు అందాలను తన కలెక్షన్ ద్వారా కళ్లకు కట్టారు.
పేరొందిన డిజైనర్లతో భారీ స్థాయి ఫ్యాషన్ ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఆకట్టుకునే లాక్మె ఫ్యాషన్ వీక్ మరోసారి ముంబైలో సందడిగా ముగిసింది. మన నగరం నుంచి కొంత కాలంగా ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో.. ఈసారి కూడా సిటి డిజైనర్లు తమదైన స్టైల్స్‌ను ప్రదర్శించిఆకట్టుకున్నారు.
సెలబ్రిటీలూసై..
సిటీ నుంచి ఈ ఈవెంట్‌కు ఈసారి ఫ్యాషన్ ప్రియులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరందరిలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిలిచారు. ఆమె ఈ ప్రదర్శనకు తగిన దుస్తులతో, గతంలో తనను ఎవరూ చూడనంత గ్లామరస్ డ్రెస్సింగ్‌తో చూపరులను కట్టి పడేశారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి. ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ కోసం ఆమె లాక్మెలో ర్యాంప్‌వాక్ చేయడం విశేషం. మరో బ్యాడ్మింటన్ స్టార్, నగరానికి చెందిన సైనా నెహ్వాల్ కూడా ఈ షోకి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment