భూతగాదాలో ఒకరిని హత్య చేసిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.
చెన్నూర్‌రూరల్ :
భూతగాదాలో ఒకరిని హత్య చేసిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పొక్కూరు గ్రామ పంచాయితీ పరిధి ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి చిన్నన్న(60)ను అతడి అన్న మల్లారెడ్డి కుమారుడు వెన్నపురెడ్డి రాజిరెడ్డి హత్య చేశాడు. చెన్నూర్ పట్టణ సీఐ శ్రీలత కథనం.. చిన్నన్నకు, రాజిరెడ్డికి గ్రామ సమీపంలో చెరో రెండెకరాల పంట చేను ఉంది. ఆదివారం ఉదయం వీరిద్దరు పంట చేనుకు వెళ్లగా తన పంట భూమివైపు పొలంగట్టు జరిగి ఉందని చిన్నన్న, రాజిరెడ్డిని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వివాదం పెద్దదిగా మారడంతో రాజిరెడ్డి, చిన్నన్న గొంతుపై చేయి వేసి కింద పడేసి పిడిగుద్దులు గుద్దాడు. చిన్నన్న అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న చిన్నన్న భార్య శంకరమ్మ వెంటనే అతనిని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.