భూసేకరణకు ‘ఎస్‌ఐఏ’ తప్పనిసరి
- పునరావాస చట్టం’ పై సదస్సులో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణ ప్రక్రియకు సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్(ఎస్‌ఐఏ)ను నిర వహించాల్సిందేనని రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ కమిషనర్ టి.కె.శ్రీదేవి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం మేరకు బాధితులకు న్యాయమైన పరిహారం లభించేలా చూడాలన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి విభాగంలో రీహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్ చట్టం 2013, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయ బాధ్యతలను ఆర్‌అండ్‌ఆర్ విభాగానికి ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమె వివరించారు. రెండువేల ఎకరాలకు మించి ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ భూమిని సేకరిస్తే తప్పనిసరిగా ఆర్‌అండ్ ఆర్ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాల్సిందేనన్నారు. సేకరించిన భూమిలో వ్యవసాయ భూమి 15 శాతానికి మించొద్దని చెప్పారు. భూసేకరణను పారదర్శకంగా పూర్తిచేయాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు..
భూసేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించే విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలన్నింటినీ తాజాగా జిల్లా కలెక్టర్లకే అప్పగించిందని కమిషనర్ తెలిపారు.