R and R
-
ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ‘కూతుళ్లూ అర్హులే’
సాక్షి, హైదరాబాద్: మేజర్లుగా ఉన్న కుమారులకు పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ ఇచ్చి మేజర్లైన కుమార్తెలకు ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం భూసేకరణ చేసినప్పుడు తల్లిదండ్రులతోపాటు మేజర్లైన కుమారులతోపాటు కుమార్తెలకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మంచిర్యాల జిల్లా తాళ్లపల్లిలో శ్రీరాంపూర్–2, శ్రీరాంపూర్–2ఏ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్‌గా మార్చేందుకు 420 ఎకరాల భూసేకరణకు 2007లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ తర్వాత ఏడాది ప్రభుత్వం అవార్డు కూడా అమలు చేసింది. అయితే మేజర్లైన తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదంటూ తాళ్లపల్లికి చెందిన కె.పద్మతో పాటు మరో 77 మంది యువతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ జరిపి, ఇటీవల తీర్పు వెలువరించారు. భూసేకరణ నోటిఫికేషన్ కంటే ముందే ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసిందని చెప్పి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మేజర్లైన కుమారులకు అమలు చేసి మేజర్లైన కూతుళ్లకు అమలు చేయకపోవడం చెల్లదన్నారు. తీర్పు వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో మళ్లీ సర్వే పూర్తి చేసి, పిటిషనర్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. -
పానం బోయినా జాగ ఇయ్య !
సాక్షి, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో మల్లన్నసాగర్ నిర్వాసితుల గృహప్రవేశాలు చేస్తుండగా.. మరోవైపు ఈ కాలనీ నిర్మాణంతో భూమి కోల్పోతున్న బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా శుక్రవారం ముట్రాజ్‌పల్లికి చెందిన మర్కంటి అయోధ్యం కాలనీలో భూమిని చదును చేసే పనులను అడ్డుకున్నాడు. ‘పానం బోయిన సరే ఈ భూమి ఇయ్య’గతంలోనే నేను మూడెకరాల భూమి ఇచ్చిన. ఈ పట్టా భూమి కూడా గుంజుకుంటే నేనట్ల బతకాలే?’అంటూ ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని పనులు ఆపేశాడు. రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనను గోస పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈనెల 4న పోలీసు పహారా మధ్య కాలనీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసమంటూ 332, 333 తదితర సర్వే నెంబర్లలో అధికారులు సుమారు 10 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో అయోధ్యంకు మూడు ఎకరాలు ఉంది. కాగా, మర్కంటి అయోధ్యం భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నామని, బాధితుడికి రావాల్సిన నష్ట పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేశామని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి తెలిపారు. -
ప్యాకేజీ ఇవ్వకుంటే కదలం
న్యాయం జరిగితేనే గ్రామం ఖాళీ చేస్తాం మా పేర్లు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి ఆర్ అండ్ ఆర్‌లో అక్రమాల నిగ్గుతేల్చాలి మండిపడుతున్న యువతీ, యువకులు పోలవరం: పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ జాబితాలో 18 ఏళ్లు పైబడిన పలువురు యువతీ, యువకుల పేర్లు నమోదు కాలేదు. ఈ కారణంగా వందల మంది ప్యాకేజ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీరిలో ఎక్కువ మంది బుట్టాయిగూడెం, ఏలూరు కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. 2006లో మొదటిసారి సర్వే నిర్వహించినపుడు డేటాలో వీరంతా నమోదయ్యారు. ఇటీవల గ్రామాలలో మళ్లీ సర్వే నిర్వహించినపుడు వీరి పేర్లు చదివి, ఉన్నట్లుగా నమోదు చేశారు. తుది జాబితాలో మాత్రం యువతీ, యువకుల పేర్లు లేవు. గ్రామ సభల సమయంలో వీరంతా కళాశాలలు వదిలి స్వంత గ్రామాలకు వచ్చారు. అప్పట్లో ప్యాకేజ్ వస్తుందని చెప్పిన అదికారులు, చివరికి జాబితాలో వీరి పేర్లను నమోదు చేయలేదు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎక్కువ మంది ఇంటర్ రెండవ సంవత్సరం, డిగ్రీ రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్నారు. వీరంతా గిరిజన యువతీ, యువకులు. జాబితాలో పేర్లు లేకపోవడంపై పోలవరం తహసీల్దార్ ఎం.ముక్కంటిని అడిగితే ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ప్యాకేజీ ఇవ్వకపోతే గ్రామం ఖాళీ చేసేది లేదని చెబుతున్నారు. ములగలగూడెంకు చెందిన మూలెం రాధ, కుంజం రామలక్ష్మి తదితరులు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. గాజులగొందికి చెందిన కారం ప్రకాష్, అరగంటి సూర్యకిరణ్ తదితరులు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వీరెవరికీ కూడా ప్యాకేజీ జాబితాలో పేర్లు రాలేదు. ప్యాకేజీలో నాపేరు రాలేదు.... నాకు 18 ఏళ్లు నిండాయి. 2006 డేటాలో నాపేరు ఉంది. ఇపుడు తుది జాబితాలో లేదు. తహసీల్దార్‌ను అడిగితే ప్రూఫ్‌లతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. నా పేరు ఎందుకు నమోదు చేయలేదో తెలియటం లేదు. మడకం కుమారి, ములగలగూడెం, పోలవరం మండలం నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నా. నాకు 18 ఏళ్లు నిండాయి. ప్యాకేజ్ జాబితాలో నా పేరు రాలేదు. ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి. ప్యాకేజ్ ఇవ్వాలి. ముళ్ల రవీంద్రారెడ్డి, గాజులగొంది, పోలవరం మండలం -
తప్పు మీద తప్పు
విద్యార్థినులను రోడ్డుకీడ్చారు పెళ్లిళ్లు అయినట్లు జాబితాలో నమోదు ఆగ్రహిస్తున్న చిన్నారులు, కుటుంబ సభ్యులు వయో వృద్ధులకు కొత్తగా పెళ్లిళ్లట పోలవరం ఆర్ అండ్ ఆర్ జాబితాలో విచిత్రాలు నిర్వాసితుల ఆందోళనలకు స్పందించని సర్కారు వేలేరుపాడు: అధికారులు ప్రకటించిన ఆర్అండ్ఆర్ జాబితాలో చివరకు విద్యార్థినిలను కూడా వదల్లేదు. చదువుకుంటున్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయినట్లు చూపించి వారు రోడ్డెక్కేలా చేశారు. ఇదే విచిత్రమనుకుంటే 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు కూడా జాబితాలో ఎంచక్కా పెళ్లిళ్లు చేసేశారు. పైగా ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేసి పక్కాగా జాబితా ప్రకటించామని గొప్పలుపోయారు. కానిæ ఈ తప్పిదాలన్నీ వారి పనితీరును, వారి డొల్లతనాన్ని వెక్కిరిస్తున్నాయి. కోటరామచంద్రాపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో ఇలాంటి ఎన్నో విచిత్రాలు బయటపడ్డాయి. పెళ్లికాని ఎంతో మంది యువతులకు పెళ్లైనట్లు జాబితాలో ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుటుంబాలుండగా, ఇందులో పదివేలు గిరిజనులకు చెందినవి. వీరిలో సుమారు ఆరువేల మంది యువతీ, యువకులు 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారుండగా, వీరి పేర్లను ఇండ్ల సర్వేలో నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2016 జులై ఒకటో తేదీ వరకు (కట్ ఆఫ్ డేట్) 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులుగా అధికారులు ప్రకటించారు. యువతులు కూడా జాబితా ప్రకటించిన జూన్ 12 నాటికి పెళ్లికాని వారు అయిఉంటేనే అర్హులని ప్రకటించారు. అప్పట్లో ప్రకటించిందే తుదిజాబితా అన్నారు. ఆ తర్వాత అర్హులను గుర్తించేందుకు వడపోత ప్రక్రియలో భాగంగా రేషన్ షాపు డీలర్లు, గ్రామాల్లో వీఆర్ఏలకు పెత్తనమంతా ఇవ్వడంతో వారి ఇష్టారాజ్యమైంది. ఇందులో 3430 మంది నకిలీ నిర్వాసితులుగా గుర్తించారు. ఇదే తుదిజాబితా అంటూ తాజాగా ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఈ జాబితాలో అనేక మంది చదువుకునే యువతులకు పెళ్లిళ్లు కాకుండానే అయినట్లు, పెళ్లిళ్లు అయిన వారిని కానట్లు ప్రకటించారు. ఫలితంగా 5 వందల పై చిలుకు యువతులు తమ హక్కు భుక్తిగా రావాల్సిన పరిహారాన్ని కోల్పోతున్నారు. కటాఫ్ డేట్ తర్వాత పెళ్లైనప్పటికీ జాబితా నుంచి తొలగింపు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు 2016 జులై ఒకటో తేదీని ప్రభుత్వం కటాఫ్ డేట్‌గా ప్రకటించి, ఆ తర్వాత సర్వే చేపట్టి 2017 జూన్ 12న జాబితా ప్రకటించారు. గ్రామసభ జరిగే సమయానికి బుర్రతోగు, చాగరపల్లి, కన్నాయిగుట్ట గ్రామాలకు చెందిన ఆసు సుజాత, కాకా భూలక్ష్మి, చింతం నాగమణి, చిచ్చడి సుబ్బలక్ష్మి, చిచ్చడి రత్నకుమారి, నూపా లక్ష్మి, కట్టి రాములమ్మ, పీసడి సుజాతలకు పెళ్లిళ్లు కాలేదు. పెళ్లికాని ఈ యువతులు గ్రామసభలో అవార్డు విచారణలో సంతకాలు కూడా చేశారు. జూన్ నెల తర్వాత ఇందులో కొంతమందికి పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో వడపోతలో ఈ పేర్లను తొలగించారు. వయోవృద్ధురాలికి కొత్తగా పెళ్లి చేశారు... మండలంలోని తిర్లాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని కన్నాయిగుట్టకు చెందిన శెట్టిగారి సుబ్బాయమ్మ అనే 80 ఏళ్లు దాటిన వృద్ధురాలికి జాబితాలో పెళ్లి చేశారు. జాబితాలో వరుస సంఖ్య 289లో 95/2 బాక్ల్గా ప్రకటించిన ఈమె 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇదే గ్రామంలో నివసిస్తోంది. ఈమె భర్త వీర్రాజు కమ్యునిష్టు ఉద్యమ నేత. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సుబ్బాయమ్మకు ఏడుగురు ఆడపిల్లలు, 14 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఈమె మ్యారీడ్, నాన్ రెసిడెంట్‌గా పేర్కొంటూ జాబితాలో ప్రకటించారు. ఈ కవలలకు పెళ్లిళ్లు చేసేశారు... జగన్నాథపురం గ్రామానికి చెందిన అఫ్జల్ పాషాకు ææనలుగురు అమ్మాయిలు. ఇందులో ఇద్దరికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఆఫ్రిన్, పర్విన్‌లు కవల పిల్లలు. వీరికి అసలు ఇంకా పెళ్లిళ్లే చేయలేదు. అయినా ఇద్దరు కవల పిల్లలను మ్యారీడ్గా ప్రకటించారు. పెళ్లిళ్లు చేయకుండా అధికారులు చేశారా, ఇదేమి అన్యాయం అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. నాకు పెళ్లి ఎవరు, ఎక్కడ చేశారో చెప్పాలి పాయం ప్రమీల, నర్సింగ్ విద్యార్ధి, కన్నాయిగుట్ట, వేలేరుపాడు మండలం ఆర్ అండ్ ఆర్ జాబితా అంతా తప్పుల తడుకగా ఉంది. నేను ఏడాది క్రితం ఇంటర్ పూర్తి చేశాను. నాకు పెళ్లి కాకుండానే జాబితా వరుస సంఖ్య 329లో పెళ్ళైనట్లు ప్రకటించారు. ఎవరు చేశారు..ఎక్కడ చేశారో చెప్పాలి. ‡ నర్సింగ్ చదువుకుంటున్న నాకు పెళ్లైనట్లు చూపారు కారం అనూష, విద్యార్ధి, కన్నాయిగుట్ట, వేలేరుపాడు మండలం నేను ఇటీవలే నర్సింగ్‌లో చేరాను. నా తల్లిదండ్రులు ఇంకా నాకు పెళ్లి చేయలేదు. ఆర్అండ్ ఆర్ జాబితాలో 339లో మాత్రం పెళ్లి అయినట్లు ధృవీకరించారు. ఇదంతా అన్యాయం. డిగ్రీ చదువుతున్న నన్ను బజారున పెట్టారు తోడం గంగాలక్ష్మి, చాగరపల్లి డిగ్రీ చదువుతున్న నన్ను బజారున పడేశారు. నాకు అసలు పెళ్లి కాలేదు. అయినా డీ బ్లాక్ 163లో పెళ్లైనట్లు ప్రకటించారు. ఈ విషయం అధికారులకే తెలియాలి. సమస్య పై ఇటీవల ప్రజాదర్బార్‌లో ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే బయటికి పొమ్మంటున్నారు. -
పరిహారం చెల్లింపులో జాప్యం వద్దు
♦ మిడ్ మానేరు కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి ♦ ఆర్అండ్ఆర్పై సమీక్షలో కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టులో 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయనున్నామని, ఈ దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, సహాయ, పునరావాస (ఆర్అండ్ఆర్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయరాదని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. మిడ్‌మానేరు. కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ప్యాకేజీ–8 లో పెండింగ్‌లో ఉన్న 200 ఎకరాల భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాల్వలను స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అన్నారు. మిడ్ మానేరు కింద 80 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, కాలువలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయకుంటే లక్ష్యం నెరవేరదని మంత్రి అభిప్రాయపడ్డారు. మిడ్ మానేరు ముంపు బాధితుల ఆర్అండ్ఆర్ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, మిడ్ మానేరు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడి ముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసి తులకు ఇంకా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లే వారికి రూ.2 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని కోరారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలలో విద్యుత్ లైన్లు తొలగించాలని చెప్పారు. అలాగే కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను కూడా వేగిరం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్, ఈఎన్సీ మురళీధరరావు పాల్గొన్నారు. -
భూసేకరణకు ‘ఎస్ఐఏ’ తప్పనిసరి
పునరావాస చట్టం’ పై సదస్సులో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణ ప్రక్రియకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్(ఎస్ఐఏ)ను నిర వహించాల్సిందేనని రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్ టి.కె.శ్రీదేవి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం మేరకు బాధితులకు న్యాయమైన పరిహారం లభించేలా చూడాలన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి విభాగంలో రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చట్టం 2013, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయ బాధ్యతలను ఆర్అండ్ఆర్ విభాగానికి ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమె వివరించారు. రెండువేల ఎకరాలకు మించి ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ భూమిని సేకరిస్తే తప్పనిసరిగా ఆర్అండ్ ఆర్ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాల్సిందేనన్నారు. సేకరించిన భూమిలో వ్యవసాయ భూమి 15 శాతానికి మించొద్దని చెప్పారు. భూసేకరణను పారదర్శకంగా పూర్తిచేయాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు.. భూసేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించే విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలన్నింటినీ తాజాగా జిల్లా కలెక్టర్లకే అప్పగించిందని కమిషనర్ తెలిపారు.