
సాక్షి, హైదరాబాద్: మేజర్లుగా ఉన్న కుమారులకు పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ ఇచ్చి మేజర్లైన కుమార్తెలకు ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం భూసేకరణ చేసినప్పుడు తల్లిదండ్రులతోపాటు మేజర్లైన కుమారులతోపాటు కుమార్తెలకు కూడా ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
మంచిర్యాల జిల్లా తాళ్లపల్లిలో శ్రీరాంపూర్–2, శ్రీరాంపూర్–2ఏ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్‌గా మార్చేందుకు 420 ఎకరాల భూసేకరణకు 2007లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ తర్వాత ఏడాది ప్రభుత్వం అవార్డు కూడా అమలు చేసింది. అయితే మేజర్లైన తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదంటూ తాళ్లపల్లికి చెందిన కె.పద్మతో పాటు మరో 77 మంది యువతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ జరిపి, ఇటీవల తీర్పు వెలువరించారు. భూసేకరణ నోటిఫికేషన్ కంటే ముందే ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసిందని చెప్పి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మేజర్లైన కుమారులకు అమలు చేసి మేజర్లైన కూతుళ్లకు అమలు చేయకపోవడం చెల్లదన్నారు. తీర్పు వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో మళ్లీ సర్వే పూర్తి చేసి, పిటిషనర్లకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment