తప్పు మీద తప్పు
తప్పు మీద తప్పు
Published Fri, Sep 8 2017 10:20 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
విద్యార్థినులను రోడ్డుకీడ్చారు
పెళ్లిళ్లు అయినట్లు జాబితాలో నమోదు
ఆగ్రహిస్తున్న చిన్నారులు, కుటుంబ సభ్యులు
వయో వృద్ధులకు కొత్తగా పెళ్లిళ్లట
పోలవరం ఆర్ అండ్ ఆర్ జాబితాలో విచిత్రాలు
నిర్వాసితుల ఆందోళనలకు స్పందించని సర్కారు
వేలేరుపాడు:
అధికారులు ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో చివరకు విద్యార్థినిలను కూడా వదల్లేదు. చదువుకుంటున్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయినట్లు చూపించి వారు రోడ్డెక్కేలా చేశారు. ఇదే విచిత్రమనుకుంటే 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు కూడా జాబితాలో ఎంచక్కా పెళ్లిళ్లు చేసేశారు. పైగా ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేసి పక్కాగా జాబితా ప్రకటించామని గొప్పలుపోయారు. కానిæ ఈ తప్పిదాలన్నీ వారి పనితీరును, వారి డొల్లతనాన్ని వెక్కిరిస్తున్నాయి. కోటరామచంద్రాపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో ఇలాంటి ఎన్నో విచిత్రాలు బయటపడ్డాయి. పెళ్లికాని ఎంతో మంది యువతులకు పెళ్లైనట్లు జాబితాలో ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుటుంబాలుండగా, ఇందులో పదివేలు గిరిజనులకు చెందినవి. వీరిలో సుమారు ఆరువేల మంది యువతీ, యువకులు 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారుండగా, వీరి పేర్లను ఇండ్ల సర్వేలో నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2016 జులై ఒకటో తేదీ వరకు (కట్ ఆఫ్ డేట్) 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులుగా అధికారులు ప్రకటించారు. యువతులు కూడా జాబితా ప్రకటించిన జూన్ 12 నాటికి పెళ్లికాని వారు అయిఉంటేనే అర్హులని ప్రకటించారు. అప్పట్లో ప్రకటించిందే తుదిజాబితా అన్నారు. ఆ తర్వాత అర్హులను గుర్తించేందుకు వడపోత ప్రక్రియలో భాగంగా రేషన్ షాపు డీలర్లు, గ్రామాల్లో వీఆర్‌ఏలకు పెత్తనమంతా ఇవ్వడంతో వారి ఇష్టారాజ్యమైంది. ఇందులో 3430 మంది నకిలీ నిర్వాసితులుగా గుర్తించారు. ఇదే తుదిజాబితా అంటూ తాజాగా ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఈ జాబితాలో అనేక మంది చదువుకునే యువతులకు పెళ్లిళ్లు కాకుండానే అయినట్లు, పెళ్లిళ్లు అయిన వారిని కానట్లు ప్రకటించారు. ఫలితంగా 5 వందల పై చిలుకు యువతులు తమ హక్కు భుక్తిగా రావాల్సిన పరిహారాన్ని కోల్పోతున్నారు.
కటాఫ్ డేట్ తర్వాత పెళ్లైనప్పటికీ జాబితా నుంచి తొలగింపు
18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు 2016 జులై ఒకటో తేదీని ప్రభుత్వం కటాఫ్ డేట్‌గా ప్రకటించి, ఆ తర్వాత సర్వే చేపట్టి 2017 జూన్ 12న జాబితా ప్రకటించారు. గ్రామసభ జరిగే సమయానికి బుర్రతోగు, చాగరపల్లి, కన్నాయిగుట్ట గ్రామాలకు చెందిన ఆసు సుజాత, కాకా భూలక్ష్మి, చింతం నాగమణి, చిచ్చడి సుబ్బలక్ష్మి, చిచ్చడి రత్నకుమారి, నూపా లక్ష్మి, కట్టి రాములమ్మ, పీసడి సుజాతలకు పెళ్లిళ్లు కాలేదు. పెళ్లికాని ఈ యువతులు గ్రామసభలో అవార్డు విచారణలో సంతకాలు కూడా చేశారు. జూన్ నెల తర్వాత ఇందులో కొంతమందికి పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో వడపోతలో ఈ పేర్లను తొలగించారు.
వయోవృద్ధురాలికి కొత్తగా పెళ్లి చేశారు...
మండలంలోని తిర్లాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని కన్నాయిగుట్టకు చెందిన శెట్టిగారి సుబ్బాయమ్మ అనే 80 ఏళ్లు దాటిన వృద్ధురాలికి జాబితాలో పెళ్లి చేశారు. జాబితాలో వరుస సంఖ్య 289లో 95/2 బాక్ల్‌గా ప్రకటించిన ఈమె 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇదే గ్రామంలో నివసిస్తోంది. ఈమె భర్త వీర్రాజు కమ్యునిష్టు ఉద్యమ నేత. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సుబ్బాయమ్మకు ఏడుగురు ఆడపిల్లలు, 14 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఈమె మ్యారీడ్, నాన్ రెసిడెంట్‌గా పేర్కొంటూ జాబితాలో ప్రకటించారు.
ఈ కవలలకు పెళ్లిళ్లు చేసేశారు...
జగన్నాథపురం గ్రామానికి చెందిన అఫ్జల్ పాషాకు ææనలుగురు అమ్మాయిలు. ఇందులో ఇద్దరికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఆఫ్రిన్, పర్విన్‌లు కవల పిల్లలు. వీరికి అసలు ఇంకా పెళ్లిళ్లే చేయలేదు. అయినా ఇద్దరు కవల పిల్లలను మ్యారీడ్‌గా ప్రకటించారు. పెళ్లిళ్లు చేయకుండా అధికారులు చేశారా, ఇదేమి అన్యాయం అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.
నాకు పెళ్లి ఎవరు, ఎక్కడ చేశారో చెప్పాలి
పాయం ప్రమీల, నర్సింగ్ విద్యార్ధి, కన్నాయిగుట్ట, వేలేరుపాడు మండలం
ఆర్ అండ్ ఆర్ జాబితా అంతా తప్పుల తడుకగా ఉంది. నేను ఏడాది క్రితం ఇంటర్ పూర్తి చేశాను. నాకు పెళ్లి కాకుండానే జాబితా వరుస సంఖ్య 329లో పెళ్ళైనట్లు ప్రకటించారు. ఎవరు చేశారు..ఎక్కడ చేశారో చెప్పాలి. ‡
నర్సింగ్ చదువుకుంటున్న నాకు పెళ్లైనట్లు చూపారు
కారం అనూష, విద్యార్ధి, కన్నాయిగుట్ట, వేలేరుపాడు మండలం
నేను ఇటీవలే నర్సింగ్‌లో చేరాను. నా తల్లిదండ్రులు ఇంకా నాకు పెళ్లి చేయలేదు. ఆర్‌అండ్ ఆర్ జాబితాలో 339లో మాత్రం పెళ్లి అయినట్లు ధృవీకరించారు. ఇదంతా అన్యాయం.
డిగ్రీ చదువుతున్న నన్ను బజారున పెట్టారు
తోడం గంగాలక్ష్మి, చాగరపల్లి
డిగ్రీ చదువుతున్న నన్ను బజారున పడేశారు. నాకు అసలు పెళ్లి కాలేదు. అయినా డీ బ్లాక్ 163లో పెళ్లైనట్లు ప్రకటించారు. ఈ విషయం అధికారులకే తెలియాలి. సమస్య పై ఇటీవల ప్రజాదర్బార్‌లో ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే బయటికి పొమ్మంటున్నారు.
Advertisement