ఇబ్రహీంపట్నంలోనూ ‘భూ’ ప్రకంపనలు
నిజాం వారసుల ద్వారా తమకు ఈ భూమి సంక్రమించిందని ప్రభుత్వ భూములను కాజేసే యత్నం జోరుగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 124 సర్వే నంబర్‌లో 172 ఎకరాల ప్రభుత్వ భూమి వుంది. ఇందులో దిల్ సంస్థకు 47 ఎకరాలు, ఏపీ హౌసింగ్ బోర్డుకు 12 ఎకరాలు, లాజిస్టిక్ పార్కుకు 20 ఎకరాలను గతంలోనే కేటాయించారు. సుమారు 70 ఎకరాల భూమి ని 50 మంది రైతులకు ప్రభుత్వం అసైన్ చేసింది. రెవెన్యూ నిబంధనల ప్రకారం 22/ఎ సెక్షన్ కింద ఉన్న ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు.
అయినప్పటికీ బడా నేతల ఒత్తిడి, అధికారుల కనుసన్నల్లో ఈ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ఇలా అసైన్ చేసిన భూమిని విక్రయించినందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ చట్టం 1971 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (పీఓటీ) కింద సుమారు 40 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఔటర్ రింగ్‌రోడ్ పక్కనే ఉన్న 8 ఎకరాల భూమిని నవాబుల వారసుల వద్ద నుంచి తాను కొనుగోలు చేశానని ఒక రియల్టర్ ఏకంగా ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన కబ్జాలో ఉంచుకున్నాడు. గోల్డ్ స్టోన్ కంపె నీతో సంబంధం ఉన్న కుటుంబీకులు 124 సర్వేనెంబర్‌లోని భూమి తమదేనని రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
అంతేగాక మంగళ్‌పల్లిలోని మరో 400 ఎకరాలు, సాహెబ్‌గూడలోని 100 ఎకరాలు అత్యున్నత న్యాయస్థానం తమకు డిక్రీ చేసిందని.. ఆ భూములను తమకు అప్పగించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఆయా భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు యత్నించారు. నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల భూ బాగోతాలు బట్టబయలు చేస్తున్న క్రమంలో ఎంతో విలువైన ఈ భూముల గుట్టు బయటపడుతోంది. ఈ భూములు అన్యాక్రాంతం కాకుం డా పాలకులు, ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వెంకట్‌రెడ్డి, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం