
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్ సంస్థలు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలని.. కేవలం సమస్య పరిష్కరించడమనే స్థాయికి పరిమితం కాకుండా బహుళజాతి స్థాయికి చేరాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రభావవంతంగా వివరించే కళను తెలుసుకోవాలని సూచించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా విస్తరిస్తామని ప్రకటించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఇండియా ఎకనమిక్ సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. స్టార్టప్‌లు నిలదొక్కుకోవడం కోసం ప్రారంభ దశలో ప్రభుత్వాలు నిర్వహించాల్సిన పాత్రను వివరించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్‌ను స్థాపించింది. దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఇది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తోంది. దాని ద్వారా మార్గదర్శనం, పెట్టుబడులు, మార్కెటింగ్, ప్రభుత్వ తోడ్పాటు అందుతున్నాయి. సామాన్యులు ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కునేలా స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఆర్‌టీఏ ఎం–వాలెట్ ఆ విధంగా పుట్టుకొచ్చిందే. టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా విస్తరిస్తాం. సాధారణంగా ఆలోచనలు మొగ్గలోనే తెగిపోతుంటాయి. కానీ టీ–హబ్‌లోకి సృజన కలిగిన వాళ్లు ఆలోచనతో వచ్చి ఉత్పత్తులను సృష్టిస్తారు..’’అని కేటీఆర్ చెప్పారు.
నిధులే కాదు.. మౌలిక వసతులు ఉండాలి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమంపై స్పందించాలని పలువురు కోరగా.. కేవలం నిధులు సమకూరిస్తే సరిపోదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వ్యవస్థాపకతను ప్రభుత్వం సృష్టించలేదని, అది ప్రైవేటు రంగం నుంచి రావాలని చెప్పారు. ప్రభుత్వాలు మాత్రం మౌలిక వసతులను, వేది కలను సమకూర్చాలన్నారు. గొప్ప ఆలోచనలకు కార్యరూపమిచ్చేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. స్టార్టప్ ఇండియా తరహాలోనే చిన్నారులు సృజనాత్మక ఆవిష్కరణలు సాధిం చేందుకు ప్రోత్సాహకరంగా వేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యులు పడే ఇబ్బందులను వివరించి వాటికి పరిష్కారాలు కనుక్కోవాలని సూచించారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ
ఎకనమిక్ సదస్సులో పాల్గొనడానికి ముందు కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. గోద్రెజ్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆది గోద్రెజ్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, రెన్యూ పవర్ చైర్మన్ సుమన్ సిన్హా, యూఎస్‌ఐబీసీ సీనియర్ డైరెక్టర్లు జై, అభిషేక్ కిషోర్, అవ్వాడ గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, ఎస్‌ఏపీ హనా ఎంటర్‌ప్రైజెస్ క్లౌడ్ అధ్యక్షుడు కె.దిలీప్‌కుమార్, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలి గోయెంకా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ కజునోరి కోనిషి తదితరులతో సమావేశమై... తెలంగాణలో పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు గల అనుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులను పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment