![T Hub to Organise Corporate Innovation Conclave in New Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/21/T-Hub.jpg.webp?itok=bPazeciF)
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధించేలా ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్న ‘టీ–హబ్’... కార్పొరేట్ సంస్థల్లో నిరంతరం ఆవిష్కరణలు జరిగేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వరుస రోడ్ షోలు, సదస్సులు నిర్వహిస్తోంది.
‘ఇనో– కనెక్ట్’పేరిట మంగళవారం బెంగుళూరులో రోడ్ షో నిర్వహించగా 22న చెన్నైలో రోడ్ షోతోపాటు వచ్చే నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’ నిర్వహిస్తారు. దీనికి ప్రపంచ నలుమూలల నుంచి 500కుపైగా ఆహ్వానితులు, 50కి మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్థికరంగం వేగంగా మార్పులకు లోనవుతున్న ప్రస్తుత వాతావరణంలో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త సాంకేతికతలను వినియోగించుకోవడం, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని నిర్మించడమే లక్ష్యంగా ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’జరుగుతుందని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి.
కార్పొరేట్ సంస్థల చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్లు(సీఎక్స్‌వో), చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లు(సీఐవో), ఎంట్రప్రెన్యూర్లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ, విద్యారంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆవిష్కరణల వృద్ధి వ్యూహం, డిజైన్, ఎమర్జింగ్ టెక్నాలజీ తదితరాలపై చర్చ జరగనుంది. ‘మారుతున్న ప్రపంచంలో ఆధునిక థృక్పథాన్ని అలవరుచుకునేందుకు, కొత్త వాణిజ్య వ్యూహాలు రూపొందించేందుకు ఢిల్లీలో జరిగే సదస్సు దోహదం చేస్తుంది’ అని టీ హబ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment