conclave
-
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022 AIG హాస్పిటల్స్ ద్వారా
-
t-hub: ఆవిష్కరణల వాతావరణానికి టీహబ్ ఊతం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధించేలా ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్న ‘టీ–హబ్’... కార్పొరేట్ సంస్థల్లో నిరంతరం ఆవిష్కరణలు జరిగేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వరుస రోడ్ షోలు, సదస్సులు నిర్వహిస్తోంది. ‘ఇనో– కనెక్ట్’పేరిట మంగళవారం బెంగుళూరులో రోడ్ షో నిర్వహించగా 22న చెన్నైలో రోడ్ షోతోపాటు వచ్చే నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’ నిర్వహిస్తారు. దీనికి ప్రపంచ నలుమూలల నుంచి 500కుపైగా ఆహ్వానితులు, 50కి మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్థికరంగం వేగంగా మార్పులకు లోనవుతున్న ప్రస్తుత వాతావరణంలో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త సాంకేతికతలను వినియోగించుకోవడం, ఎంట్రప్రెన్యూర్షిప్ సంస్కృతిని నిర్మించడమే లక్ష్యంగా ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’జరుగుతుందని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ సంస్థల చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్లు(సీఎక్స్‌వో), చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లు(సీఐవో), ఎంట్రప్రెన్యూర్లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ, విద్యారంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆవిష్కరణల వృద్ధి వ్యూహం, డిజైన్, ఎమర్జింగ్ టెక్నాలజీ తదితరాలపై చర్చ జరగనుంది. ‘మారుతున్న ప్రపంచంలో ఆధునిక థృక్పథాన్ని అలవరుచుకునేందుకు, కొత్త వాణిజ్య వ్యూహాలు రూపొందించేందుకు ఢిల్లీలో జరిగే సదస్సు దోహదం చేస్తుంది’ అని టీ హబ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. -
ఇలెర్న్ మార్కెట్స్ ఆధ్వర్యంలో మెగా ట్రేడింగ్ కాంక్లేవ్
ఆన్లైన్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఇ లెర్న్ మార్కెట్స్ ఆధ్వర్యంలో మెగా ట్రేడింగ్ కాంక్లేవ్ జరగనుంది. 2022 ఏప్రిల్ 26 నుంచి 29 వరకు గోవా వేదికగా ఈ ఫేస్ టూ ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు మంది స్టాక్ మార్కెట్ ట్రేడ్ పండితులు ఈ సదస్సులో పాల్గొన బోతున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 250 మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరికి వివిధ అంశాలపై ప్రకాష్ గబ, వివేక్ బజాజ్, ప్రెమల్ ఫారెఖ్, శివకుమార్ జయచంద్రన్, విజయ్ థక్రె, చెతన్ పంచమియ, రాకేష్ బన్సల్, కునాల్ సరౌగి, పీయుష్ చౌదరి, అసిత్ బరన్ పతి, విషాల్ బి మల్కన్ మరియు సందీప్ జైన్లు మార్కెట్‌పై మరింత లోతైన అవగాహాన కల్పించనున్నారు. దీని కోసం లైవ్ మార్కెట్ స్ట్రాటజీ సెషన్లు నిర్వహించబోతున్నారు. ఒకప్పుడు స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ అంటే ముంబై, గుజరాత్‌లతో పాటు మెట్రో నగరాల్లోని వారే ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జిల్లా కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంత ప్రజలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడేళ్లుగా భారీగా పెరుగుతున్న డీమ్యాట్ అకౌంట్లే ఇందుకు నిదర్శనం. ఈ తరుణంలో ట్రేడర్లతో మంచి నెట్వర్క్ ఏర్పాటు చేయడం స్టాక్‌మార్కెట్ మీద సరైన అవగాహాన కల్పించడం లక్ష్యంగా ఈ కాంక్లేవ్ నిర్వహిస్తోంది ఈలెర్న్ మార్కెట్స్ సంస్థ. వివేక్ బజాజ్ 2014లో స్టాక్ఎడ్జ్తో పాటు ఈలెర్న్ మార్కెట్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్లైన్లో ప్రత్యేక యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కి సంబంధించిన తాజా ఆప్‌డేట్స్‌ని ఈ సంస్థ అందిస్తోంది. సుమారు 150 మంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈలెర్న్ టీమ్‌లో ఉన్నారు. -
Kannababu: ‘తూర్పు’లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని సదుపాయాలూ ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవంలో భాగంగా కాకినాడలో ఎగుమతిదారుల సమ్మేళనం (ఎక్స్‌పోర్టర్స్ కాన్క్లేవ్) శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని రాష్ట్ర మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో 28 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వాణిజ్య అభివృద్ధితో పాటు పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పెద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు చక్కని అవకాశాలున్నాయని వివరించారు. ఇప్పటికే రెండు పోర్టులు అందుబాటులో ఉండగా మరొకటి రాబోతోందని తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని, పెట్టుబడిదారులు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, పొన్నాడ సతీష్ పాల్గొన్నారు. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్‌తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టింగ్ వ్యవసాయంలో అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం అనేది ప్రధాన అడ్డంకిగా ఉందని ఫిక్కి సీఈవో కాన్క్లేవ్ పేర్కొంది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో పంటకు ధరను మార్కెట్ రేటును బట్టి నిర్ణయిస్తారా లేక జరిగిన వ్యయానికి లాభం కలిపి ఇస్తాయా అన్న విషయంలో స్పష్టత ఏర్పడితేనే ఈ విధానం విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వ్యవసాయంలో ‘నెక్స్ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఫిక్కి ఏర్పాటు చేసిన సీఈవో సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కావేరీ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మితున్ చాంద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం నీరు, విద్యుత్ అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించగలిగితే పప్పు దినుసులను దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ‘ఫుడ్ 360’ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అందచేశారు. జోరుగా పీఈ, వీసీ నిధుల ప్రవాహం... కాగా భారత వ్యవసాయ-వ్యాపార కంపెనీల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) నిధుల ప్రవాహం జోరుగా సాగనున్నది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పీఈ, వీసీ ఫండ్స్ ఆసక్తిగా ఉన్నాయని కేపీఎంజీ-ఫిక్కి తాజా నివేదిక వెల్లడించింది. సదస్సు సందర్భంగా ఈ నివేదిక వెలువడింది.