సాక్షి, సూర్యాపేట : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యునిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ పార్థివదేహాం ఉన్న చితికి నిప్పంటించారు.
సంతోష్ అంత్యక్రియలకు హాజరైన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. (బలిదానం వృథా కాదు!)
కాగా, కల్నల్ సంతోష్ ఇంటి నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మేర మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. సంతోష్ అంతిమయాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు.
(వీరుడా.. వందనం)
కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని కడచూపు చూసేందుకు బారులు తీరిన బంధువులు, ప్రజలు
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment