సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన అందరూ ఇష్టపడే ఖమ్మం నగరం ఇప్పుడు అల్లరిమూకలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో బ్యాచ్‌లుగా విడిపోయి, రోడ్లమీదే తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా పోలీసులకు పట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా..
ఖమ్మం నగరంలో దాదాపుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా, అందులో పోలీస్ అధికారి ఉన్నా రోడ్డుపైనే తన్నుకుంటున్నారు. కనీసం పోలీసులు వస్తున్నారనే మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే పోలీస్ స్టేషన్‌లో పోలీసులనే దుర్భాషలాడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఖమ్మంలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా రాడ్‌లు , కర్రలతో పోలీసుల ముందే తన్నుకుంటున్నా, అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందిని నెట్టివేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారులతోపాటు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు వాపోతున్నారు. రోడ్లపై ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరిమూకలను స్టేషన్‌కు తీసుకొచ్చిన 10 నిమిషాలలోపే రాజకీయ నాయకులు ప్రత్యక్షమవుతున్నారని, చివరకు శబ్ద కాలుష్యం ఏర్పడే డీజేలను స్టేషన్‌కు తరలించినా పైరవీలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్పుదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల అదుపుకోసం అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు , బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేసినా అల్లరిమూకలను అదుపు చేసే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో స్టేషన్‌కు ఒక్క పోలీస్ జీప్ ఉన్నా శాంతి భద్రతలను అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదనే విమర్శలు వినపడుతున్నాయి.
త్రీటౌన్ పరిధిలో..
నిత్యం వ్యాపారాలతో కళకళలాడే త్రీటౌన్ గ్యాంగ్‌వార్‌లకు అడ్డాగా మారిపోయింది. యువకులు రోడ్డుమీదనే తన్నుకుంటున్నా పట్టించుకోనే దిక్కులేదు. పంపింగ్‌వెల్‌రోడ్, గాంధీనగర్, వ్యవసాయమార్కెట్ ప్రాంతం, బొక్కలగడ్డ , సారథీనగర్ , జూబ్లీపుర , ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎక్కువై అర్ధరాత్రి వరకు మద్యం, గంజాయి వంటివి సేవించి ద్విచక్రవాహనాలు అతివేగంతో నడుపుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు గ్యాంగ్‌లను పెంచి పోషిస్తూ్త తమ పబ్బం గడుపుకుంటున్నారని, కొందరు పోలీస్ సిబ్బంది కూడా సాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వనటౌన్, టూటౌన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చొరవ తీసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే పోలీస్ అధికారులు సైతం కరువయ్యారనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అల్లరిమూకలను, వారిని రెచ్చగొడుతున్నవారిపై ఉక్కు పాదం మోపకపోతే ఖమ్మం మరో బెజవాడగా మారే అవకాశం ఉందని, సామాన్యులకు రక్షణ ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్రీటౌన్ సీఐ సీహెచ్. శ్రీధర్‌ను వివరణ కోరగా.. అల్లరి మూకలపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. రెండుసార్లకు మించి అరెస్ట్‌యితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment