బడ్జెట్ సమావేశాల తరువాత సింగపూర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులను సింగపూర్, మలేసియా దేశాలకు పంపించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఆ రెండు దేశాలు సాధించిన ప్రగతి అద్భుతమని, పరిమిత వనరులున్నప్పటికీ ఆ దేశాలు ఉన్నతస్థాయిని అందుకోవడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎంను సోమవారం సచివాలయంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా తన పర్యటన విశేషాలను కేసీఆర్ వారికి వివరించారు. సింగపూర్ దేశం పచ్చికబయళ్లతో నిండి ఉంటుందని, ఆరుబయట ఎక్కడా చిన్నకాగితం ముక్క కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు
. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఓ దేశం ఎలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లిందో సింగపూర్ నిరూపించిందని చెప్పారు. తమ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్‌ను కోరినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సింగపూర్ జనాభా కేవలం 53 లక్షలు మాత్రమేనని.. కానీ అక్కడికి ఏటా ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ దేశానికి భూభాగం తక్కువగా ఉండడంతో సముద్రంలోకి భూభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. స్థానికంగా కనీసం మంచినీళ్లు కూడా ఆ దేశంలో దొరకవని, అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందేనని చెప్పారు. అలాంటిది అపారమైన వనరులు, జనాభా, భూభాగం ఉన్న మనదేశం అభివృద్ధి చెందకపోవడం ఆవేదన కలిగించిందని కేసీఆర్ పేర్కొన్నారు. సింగపూర్ ఈ స్థాయికి రావడానికి ఆ దేశ మొదటి ప్రధాని లీ క్వాన్ యూ కారణమని, ఆయన రాసిన ‘సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టూ ఫస్ట్’ పుస్తకాన్ని తాను 1995లో చదివానని సీఎం చెప్పారు. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించనున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో తాను అనేక మందితో చర్చలు జరిపానని, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వారు ఆరా తీశారని తెలిపారు.
ఇక ప్రజాప్రతినిధుల వంతు..
Published Tue, Aug 26 2014 2:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement