
బీజేపీ మహిళా సంకల్ప దీక్షలో మాట్లాడుతున్న లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన మహిళా సంకల్ప దీక్ష మద్యనిషేధ ఉద్యమానికి నాంది మాత్రమేననీ దీన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మద్యం ప్రభావంతోనే మహిళలపై నేరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, తెలంగాణలో మద్యాన్ని నిషేధించేవరకు పోరాడతామన్నారు. గురువారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రెండురోజుల మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్య నియంత్రణ శాఖను, మద్యాన్ని పెంచే శాఖగా మార్చారన్నారు. ‘దిశ’ ఘటన తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ సాగుతోందని ఆడపిల్లలపై అకృత్యాలకు మద్యమే ప్రధాన కారణమని భావించి బీజేపీ దీక్ష చేస్తోందన్నారు.
ఏపీ సీఎం జగన్ మద్య నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వాటిని చూసైనా ఇక్కడి ప్రభుత్వం నేర్చు కోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ రాథోడ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న కుమ్రంభీమ్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ‘సమత’ కుంటుంబీకులను లక్ష్మణ్ పరామర్శించారు. ‘సమత’పిల్లను చదివించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని, వారు ఎంతవరకు చదివితే అంత వరకు పార్టీ చదివిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment