
‘బోరంచ’.. నిర్లక్ష్యం కొండంత
బోరంచ ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. పథకం పనులు పూర్తయి ఐదేళ్లవుతున్నా ఇంకా వినియోగంలోకి రావడంలేదు. రూ.20.21 కోట్లతో నిర్మించిన ఈ ఎత్తిపోతల.. సర్వం లీకేజీల మయంగా మారింది. నాసిరకం పనుల వల్లే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.
జోగిపేట: బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బోరంచ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2,900 ఎకరాలకు నీరందించాలన్నదే ‘ఎత్తిపోతల’ ముఖ్య ఉద్దేశం. కాని ఇప్పటివరకు ఒక్క ఎకరాకు సరిపడా నీటిని కూడా అందించలేకపోతోంది. ఈ పథకం ద్వారా నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలం సింధోల్, టి. లింగంపల్లి, తాటిపల్లి, మనూర్ మండలంలోని బోరంచ గ్రామాలలోని భూములకు సాగు నీరందించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని అప్పట్లో మంత్రిగా ఉన్న సి. దామోదర రాజనర్సింహ 2009 ఆగస్టు మాసంలో పనులకు శంకుస్థాపన చేశారు. టీ.లింగంపల్లి ప్రాంతంలోని బోరంచ పరీవాహకం నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
ఈ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు సరైన శ్రద్ధ కనబరచలేదన్న ఆరోపణలున్నాయి. ఈ పథకం కోసం ఏర్పాటు చేసిన పైపులు, జరిగిన పనుల్లో నాణ్యత కొరవడటంతో లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. ఎన్నికలకు మం దు ఈ పథకాన్ని ట్రయల్న్ ్రచేసేందుకు ఏ ర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో బ్రేక్ పడింది. దీంతో ఈ పథకంపై ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.
అప్పట్లో సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్వహించిన ట్రయల్ రన్ వల్ల కాలువలు నీటి ప్రవాహనికి దెబ్బతినడంతో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందనే చెప్పవచ్చు. బోరంచ ఎత్తిపోతల పథ కం పనులు సైతం లికేజీలు ఏర్పడటంతో ఆ పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. బోరంచ ఎత్తిపోతల పథకం పూర్తయినట్లయితే వందలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందిస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం బోరంచ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించి మరమ్మతు పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
లీకేజీల మరమ్మతులు
చేయాల్సింది కాంట్రాక్టరే
లీకేజీల మరమ్మతులు చేయాల్సింది కాంట్రాక్టరే.. రెండేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు చేయాల్సి ఉన్నా వారిదే బాధ్యత ఉంటుంది. లీకేజీలు ఏర్పడిన విషయం వాస్తవమే. పైప్‌లైన్ ద్వారా లేదా కాలువల ద్వారా నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
- దిగంబర్ రావు, బోరంచ ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు
లీకేజీలతో పంటలు పాడయ్యాయి
పైప్‌లైన్లు సక్రమంగా ఏర్పాటు చేయకపోడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తమ పంటలు పాడయ్యాయి. లీకేజీలను సరిచేసిన తర్వాతే పథకాన్ని ప్రారంభించాలి. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి.
-మారుతి, తాటిపల్లి రైతు