సాక్షి, హైదరాబాద్ : 2004, డిసెంబర్ 9వ తేదీ.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71 తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ చిరుతపులి 43వ నంబరు ప్లాట్‌లో నివసించే పారిశ్రామికవేత్త జయప్రకాశ్–సాయిలీల దంపతుల ఇంట్లోకి ప్రవేశించింది. అదే సమయంలో వంటగదిలో ఇంటి పనులు చేస్తున్న పనిమనిషి కిటికీ తెరిచింది. ఇంకేముందు ఎదురుగా చిరుతపులి కనిపించింది. ఒక్కసారిగా టెన్షన్‌కు గురైన ఆ పనిమనిషి, వెంటనే తేరుకొని జయప్రకాశ్ దంపతులను అప్రమత్తం చేసింది. వెంటనే వారు ఇంటికి అన్నివైపులా ఉన్న తలుపులు, కిటీకీలు మూసేసి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటి జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సి. చంద్రశేఖర్ తన సిబ్బందితో వచ్చారు.
పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఆయన జూ అధికారులకు ఫోన్ చేసి, అటవీ సిబ్బందిని రప్పించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన పోలీసులు, అటవీ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఆ చిరుత చిక్కకపోగా, గోడ దూకి పక్కింట్లోకి వెళ్లింది. అలా ఓ నాలుగైదు ఇళ్లు దాటుకుంటూ వెళ్లి...ఓ ఇంట్లోని బాత్‌రూమ్‌లో వెళ్లింది. ఎలాగైనా బాత్‌రూమ్‌లోనే చిరుతను బంధించాలని అటవీ అధికారులు, పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయినా ఆ చిరుత వారి కళ్లుగిప్పి బాత్‌రూమ్ నుంచి పక్కింట్లోకి జారిపోయింది. ఇలా మళ్లీ ఆరేడు ఇళ్లు దాటుకుంటూ పారిపోయింది. ఇక దానిని వలేసి పట్టడం సాధ్యం కాదని భావించారు. పారిపోతున్న చిరుతపై ఇన్‌స్పెక్టర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చిరుత అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అటవీ అధికారులు బోనులో బంధించి జూపార్కుకు తీసుకువెళ్లి చికిత్స చేశారు. కోలుకున్న తర్వాత అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలేశారు.
2020, మే 14వ తేదీ.. కాటేదాన్ అండర్ పాస్
ఉదయం ఏడున్నర ప్రాంతంలో అండర్‌పాస్ డివైడర్‌ను ఆనుకొని ఓ చిరుత కనిపించింది. చూసినవారంతా ఏదో గాయమైన అక్కడ పడుకుని ఉందని భావించారు. కొంతమంది స్థానికులు అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు. తీరా దగ్గరకు వెళ్లేసరికి ఆ చిరుత వాయువేగంతో ఆరు ఫీట్ల ఎత్తయిన గోడ దూకి బుద్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లోకి వెళ్లింది. ఆ ఫామ్ హౌస్ 55 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. వినియోగంలో లేని ఫామ్‌హౌస్ కావటంతో చిరుతను పట్టుకోవడం అటవీ అధికారులకు అంత సులువేం కాదు. గురువారం అర్ధరాత్రి వరకూ చిరుత బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగాయి. అయితే చిరుత సంచారంతో బుద్వేల్‌లోని వెంకటేశ్వరకాలనీ, శ్రీరాంనగర్, నేతాజీనగర్ బస్తీ వాసులు గజగజ వణికిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment