రాజేంద్రనగర్/బహదూర్‌పురా : చాలారోజులుగా అధికారులను, జనాన్ని హడలెత్తిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వాలంతరి వెనుక భాగంలోని డెయిరీ ఫామ్‌హౌస్ వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శుక్రవారం రాత్రి చిరుత ఈ ప్రాంతంలో రెండు లేగదూడలను చంపి తినడంతో అధికారులు ఇక్కడ 2 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లు కనిపించకుండా ఏర్పాట్లు చేసి లోపల లేగదూడల కళేబరాలను ఉంచారు. రెండు సీసీ కెమెరాలను సైతం అమర్చారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోన్‌లో చిక్కుకున్న చిరుత గాండ్రింపులు విన్న ఓ పశువుల కాపరి అటవీ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని.. చిరుత పూర్తిగా బోనులో చిక్కుకుందని నిర్ధారించుకుని దాని దగ్గరకు వెళ్లారు.
బోనులో నుంచి కళేబరాలను వేరుచేశారు. సమాచారం అందుకున్న జూపార్కు సిబ్బంది.. నెహ్రూ జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ హకీం ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని ప్రత్యేక వాహనంలో చిరుతను జూపార్కుకు తరలించింది. బోనులో నుంచి బయటకు వచ్చేందుకు ఇనుప చువ్వలను గట్టిగా ఢీకొనడంతో చిరుత స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ముఖంపై గాయాలైన చిరుతకు జూలోని వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. పూర్తిగా కోలుకున్నాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమ్రాబాద్ ఫారెస్ట్ అడవుల్లో వదిలేస్తామన్నారు.
ఊపిరిపీల్చుకున్న జనం...
మే 14న ఉదయం బుద్వేల్ రైల్వే అండర్‌పాస్‌లో కనిపించిన చిరుత అనంతరం పక్కనే ఉన్న ఫామ్‌హౌస్‌లోకి పారిపోయి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అనంతరం అగ్రికల్చర్ వర్సిటీ, మేనేజ్, గ్రేహౌండ్స్, నార్మ్, హనుమాన్ నగర్, వాలంతరీ, కిస్మత్‌పూర్ గ్రీన్ సిటీ ప్రాంతాల్లో స్థానికులకు చిరుత కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా లేగదూడలతో పాటు గొర్రెల మందపై దాడి చేసి వాటిని చంపేసింది. అధికారులతోపాటు ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment