⇒ ఒక్కరోజే 21 మంది మృతి
⇒ జిల్లాలో కొనసాగుతున్న వడదెబ్బ మరణాల పరంపర
రంగంపేటలో...
కొల్చారం: వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన రంగంపేటకు చెందిన తూర్పాటి యాదగిరి(24) ఆదివారం అర్ధరాత్రి మరణించాడు. ఇతను ఐస్‌క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఐస్‌క్రీమ్ అమ్మి ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురికాగా స్థానికంగా గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. కాగా యాదగిరి అర్ధరాత్రి మరణించినట్టు అతని భార్య నిర్మల రోదిస్తూ తెలిపింది.
పాములపర్తికి చెందిన ఒకరు..
వర్గల్: మండలంలోని పాములపర్తికి చెందిన ఉప్పరి చంద్రయ్య(65) మరణించాడు. ఆదివారం ప్రజ్ఞాపూర్‌లోని కుమారుడి ఇంటికి వెళ్లిన ఆయన వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. సోమవారం పాములపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు.
హబ్షీపూర్‌లో వృద్ధురాలు
దుబ్బాక: మండలంలోని హబ్షీపూర్‌లో వంగ నర్సమ్మ(65) సోమవారం మరణించింది. ఆదివారం తన వ్యవసాయ పొలంలో కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు వెంటనే దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో సోమవారం ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తరువాత కొద్దిసేపటికే విపరీతమైన విరేచనాలు చేస్తూ మరణించింది.
దౌల్తాబాద్: మండలంలోని చిన్నమాసాన్‌పల్లిలో ఆవుల భారతమ్మ(72) ఆదివారం గజ్వేల్‌లో నివాసముంటున్న కొడుకు వద్దకు వెళ్లింది. ఆ వెంటనే వడదెబ్బకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది.
సంగారెడ్డిలో వృద్ధుడు..
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఎల్‌బీ నగర్‌లో శనివారం రాత్రి రాందాస్ (67) అనే వృద్ధుడు వడదెబ్బతో మరణించాడు. రాందాస్ కూలి పనులు చేస్తుంటాడు. ఎండను తట్టుకోలేక రెండు రోజులుగా వడదెబ్బకు గురయ్యాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
సంగారెడ్డి రూరల్: మండలంలోని జుల్‌కల్‌లో సోమవారం కలివేముల బుచ్చయ్య(65) మరణించాడు. ఆదివారం తన పశువులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండ టంతో పొలంలోనే కళ్లుతిరిగి పడిపోయాడు. తీవ్రఅస్వస్థతకు గురైన బుచ్చయ్యను చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు.
గంగాయపల్లిలో..
శివ్వంపేట: మండలంలోని గంగాయపల్లిలో ఆదివారం అర్ధరాత్రి బోరు మోటార్ మెకానిక్ ఉద్యమారి శేఖర్‌గౌడ్(35) మృతి చెందాడు. కాలిపోయిన బోరు మోటార్‌ను తీయడానికి వెళ్లి, రాత్రికి ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబ సభ్యులు అతణ్ణి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
పుల్‌కల్ మండలంలో ఇద్దరు
పుల్‌కల్: మండలంలోని శివ్వంపేట, చౌటకూర్ గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. శివ్వంపేటకు చెందిన చేపల శైలజ(35) ప్లాస్టిక్ కవర్స్ ఏరుతూ జీవనం సాగిస్తుంది. గురువారం అస్వస్థతకు గురికాగా శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. కాగా చౌటకూర్‌లో గోనె వెంకయ్య(62) సోమవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. సోమవారం ఉదయం ఇంట్లోనే మరణించాడు.
రామాయంపేటలో ఇద్దరు..
రామాయంపేట: మండంలో ఇద్దరు మరణించారు. డి.ధర్మారం పంచాయతీ పరిధి శివ్వాయిపల్లికి చెందిన శామర్తి తిరుమలవ్వ(55) సోమవారం మరణించింది. రెండురోజుల క్రితం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె అస్వస్థతకు గురైంది. స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కాగా నందిగామకు చెందిన ఆకుల కిష్టమ్మ(70) సోమవారం మరణించింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా అస్వస్థతకు గురై సోమవారం మృతి చెందింది.
గజ్వేల్ రూరల్: ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు రాజవ్వ(50) మరణించింది. ఆదివారం పొద్దంతా పొలంలో పనులు చేసింది. రాత్రి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
చేగుంట: మండలం పులిమామిడి మదిర గ్రామం కిష్టాపూర్‌కు చెందిన కూలీ చాకలి అంజయ్య(40) సోమవారం మృతిచెందాడు. ఆదివారం మామిడితోటలో పని చేస్తుండగా వడదెబ్బకు గురికాగా హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు.
వడదెబ్బకు ఇద్దరి బలి
మెదక్ రూరల్: వడదెబ్బకు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కూచన్‌పల్లికి చెందిన మాటూరి రుక్కమ్మ(80) రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోమవారం మరణించింది. తొగిట గ్రామానికి చెందిన కూలి తరాలి కమలమ్మ(33) వారం రోజుల క్రితం వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలైంది. ఆసుపత్రికి చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న ఆమె సోమవారం పొలం పనులకు వెళ్లి అస్వస్థతకు గుైరె ంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.
సిద్దిపేట మండలంలో ఇద్దరు...
సిద్దిపేట రూరల్: మండలంలో ఒకే రోజు ఇద్దరు మరణించారు. లక్ష్మీదేవిపల్లికి చెందిన దండు రామవ్వ (65) ఆదివారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించి రాత్రి ఇంటికి వెళ్లింది. ఆ తరువాత ఆయాస పడుతూ అర్ధరాత్రి మృతి చెందింది. నారాయణరావుపేటకు చెందిన సిద్ధిలింగం (65) సోమవారం మరణించారు. ఆదివారం పొలం వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. వడదెబ్బ తగిలి అస్వస్థకు గురై మృతి చెందాడు.
నిద్రలోనే కన్నుమూసిన శంకరయ్య..
టేక్మాల్: దనూరలో సోమవారం వృద్ధుడు మరణించాడు. పి. శంకరయ్య(60) వ్యవసాయంతో పాటు కూలి పనులు చేస్తుంటాడు. పొలం పనులు చేసి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే నిద్రలోనే కన్నుమూశాడు.
చిన్నకోడూరు: మండలంలోని పెద్దకోడూరులో సోమవారం కంకటి రాజేశ్వరి(65) మృతి చెందింది. మోతుకు ఆకులు తెంపడానికి వెళ్లి వడదెబ్బ బారిన పడింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది.
కొండపాక: వడదెబ్బతో దుద్దెడకు చెందిన పాల నారాయణగౌడ్(65) సోమవారం చనిపోయాడు. మధ్యాహ్నం వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
దుబ్బాక: తొగుట మండలం కాన్గల్‌లో ఆదివారం సాయంత్రం కుమ్మరి భూమయ్య (67) మరణించాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఈయన తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా శవమై కనిపించాడు.
తగ్గని ఎండలు ఆగని మరణాలు
Published Tue, May 26 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement