
లైన్ క్లియర్
► స్టోరేజ్ ట్యాంకు లేకుండానే కోనాయమాకుల ఎత్తిపోతల పథకం
► రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు
► అన్నీ కుదిరితే నవంబర్‌లో పంటచేలకు నీరు
► పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడి
గీసుకొండ(పరకాల): పెండింగ్‌లో ఉన్న కోనాయమాకుల ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం హన్మకొండలోని తన నివాసంలో మండలంలోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధలు, నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో ఎత్తిపోతల పథకంలో చేపట్టిన మార్పుల గురించి వివరించారు. 2008లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. వాటిని సరిచేసి రైతులకు ఇబ్బం ది లేకుండా పలు మార్పులు చేసి త్వరగా పూర్తి చేసేలా మంత్రి హరీష్‌రావు, సీఎం కేసీఆర్‌ను ఒప్పించామన్నారు. అన్నీ కుదిరితే నవంబర్ నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి కాల్వ ద్వారా చేలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
ముందుగా అనుకున్న విధంగా మనుగొండ నర్సింహ చెరువును స్టోరేజ్ ట్యాంకుగా మార్చి అక్కడి నుంచి నీటిని విడుదల చేయాలని అప్పటి అధికారులు డిజైన్ చేశారని పేర్కొన్నారు. వాస్తవాలను పరిశీలిస్తే నర్సింహ చెరువులో కేవలం 0.067 టీఎంసీల నీరు నిల్వచేసే వీలుందని, అ నీటిని నాలుగున్నర రోజుల్లోనే పంప్ చేయవచ్చని తెలిపారు. మండలంతో పాటు సంగెం, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 14,500 ఎకరాలకు సాగు నీరు అందించడానికి నర్సింహచెరువులో నిల్వ చేసే నీరు సరిపోదని గుర్తించి త్రిసభ్య కమిటీ ద్వారా ప్రభుత్వానికి విషయాలను నివేదించామని వివరించారు.
నివేదిక ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేసి కాకతీయ ప్రధాన కాల్వ నుంచి నీటిని లిఫ్ట్ చేసి పంటచేలకు తరిలించేలా డిజైన్ చేశామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.30 కోట్ల ఆదా అవుతుందన్నారు. కొనాయమాకుల వద్ద ఉన్న కాకతీయ ప్రధాన కాల్వ రోడ్డు బ్రిడ్జి సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ వెనక 6 ఎకరాల స్థలంలో పంప్‌హౌస్ నిర్మించి, కాల్వ నీటిని అందులోకి లిఫ్ట్ చేస్తారని వివరించారు. ఇప్పటికే కొంత మేర తవ్విన కాల్వ పనులను పూర్తిచేసి దాని ద్వారా నేరుగా పంట చేలకు నీరందిస్తామన్నారు. నర్సింహచెరువు ఆయకట్టు రైతులు తమ భూములు పోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బందులు రాకుండానే ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసినట్లు చెప్పారు.
కేవలం రూ.34 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని, కాల్వ భూసేకరణ విషయంలో తాజా భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. కాకతీయ ప్రధాన కాల్వ 234 కిలోమీటరు నుంచి 248 కిలోమీటరు వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర పూడికతీత, మరమ్మతుల కోసం రూ.8 కోట్ల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆయన వెంటన జెడ్పీటీసీ ఆంగోతు కవిత, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, నాయకులు ముంత రాజయ్యయాదవ్, సుంకరి శివ, మాధవరెడ్డి, రాంబాబు, మహబూబ్‌నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.