కోరుట్ల కోట బురుజులు
కోరుట్ల: ఐదేళ్లుగా ఉధృతంగా సాగిన ఉద్యమం..అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీ దరిమిలా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. గత నెల 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో పాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అభ్యంతరాలకు నెల రోజుల గడువు..అంటే సరిగ్గా ఈనెల 9 వ తేదీ చివరి రోజుగా నిర్ణయించారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికీ పెద్దగా అభ్యంతరాలు లేనట్లుగా సమాచారం. ఈక్రమంలో మరో 4 రోజుల్లో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కల సాకారం కానుంది.
అప్పుడు..అంచనా తప్పింది
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సుమారు ఐదేళ్లుగా ప్రజలు వివిధ రకాలుగా ఉద్యమం కొనసాగించారు. రెండున్నరేళ్లకు ముందు టీఆర్‌ఎస్ సర్కార్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైన సమయంలో సుమారు 3 నెలల పాటు కోరుట్ల డివిజన్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. సుమారు 17 దరఖాస్తులు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సర్కార్‌కు పంపినా ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకు ఊరించి చివరకు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. మెట్‌పల్లి డివిజన్ పరిధిలో కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అంచనాలు తలకిందులు కావడంతో ఆ సమయంలో స్థానికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యమం మరికొన్నాళ్లు సాగినా నిరుత్సాహం వెంటాడింది.
ఎన్నికల సాక్షిగా..
రెండున్నరేళ్ల తర్వాత టీఆర్‌ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఈ సమయంలో కోరుట్ల సెగ్మెంట్‌లో కోరుట్ల పట్టణ ఓటర్లు కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నాయనగా కోరుట్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మరోసారి అప్పటి మంత్రి కేటీఆర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయమని ప్రకటించారు. ఈ విషయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవచూపడంతో డివిజన్ ఏర్పాటుపై ఎన్నికల సమయంలో గట్టి హామీ దొరికింది. కీలక నేతల నుంచి హామీ రావడంతో కోరుట్ల స్థానికుల్లో టీఆర్‌ఎస్‌పై ఉన్న అసంతృప్తి చాలా మేర సమసిపోయింది. తర్వాత కోరుట్ల ఎమ్మెల్యేగా విద్యాసాగర్‌రావు గెలవడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కోరుట్ల డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యంతరాలు అంతంతే..
కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు సూచనలకు 30రోజుల గడువు ఇవ్వగా, ఇప్పటికి 26 రోజులు గడిచాయి. మరో నాలుగురోజుల సమయం ఉంది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కూడిన కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రానట్లు సమాచారం. చిన్నపాటి మార్పులకు చెందిన సలహాలు ఉన్నా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కాకపోవడం గమనార్హం. ఈక్రమంలో మరో 4రోజులు గడిచిన తర్వాత కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాల గడువు ముగిసిపోనుంది.
కార్యాలయాలు ఎక్కడో..
కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు చెందిన కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఊరికి దూరంగా ఆదర్శనగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించిన తర్వాత ఆ భవనంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల పోలీస్ సబ్ డివిజన్ ఉంటుందా లేదా అన్న విషయంలో పూర్తి స్పష్టత లేదు. గతంలో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం పెద్దగుండు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సబ్ డివిజన్ ఏర్పాటుతో ఇతరత్రా సబ్ డివిజనల్ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.
కోరుట్ల కోట బురుజులు
Comments
Please login to add a commentAdd a comment