ఖజానాకు కిక్కు
మద్యం దుకాణాల డీలర్ల ఖరారు
దరఖాస్తుల ద్వారారూ.3.4 కోట్లు..
దుకాణాల ద్వారా రూ. 64.57 కోట్ల ఆదాయం
అదృష్టవంతుల్లో ఆరుగురు మహిళలు
సంగారెడ్డి క్రైం: మద్యం దుకాణాల కేటాయింపుతో ఖజానాకు కిక్కెక్కింది. జిల్లాలోని 161 మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులు ద్వారా రూ.3.4 కోట్లు, లెసైన్స్ ఫీజు ద్వారా 64.57 కోట్లు ఖజానాకు చేరింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ డ్రా పద్ధతిలో డీలర్లను ఎంపిక చేశారు. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా జిల్లాలోని 176 దుకాణాలకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అయితే 161 దుకాణాలకు గానూ 1,217 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సోమవారం సంగారెడ్డిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్ లాటరీ తీసి డీలర్లను ఖరారు చేశారు. అయితే పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తు చేసిన ఠమొదటిపేజీ తరువాయి
ఇద్దరు గైర్హాజరు కాగా, మిగతా 159 మద్యం దుకాణాలకు డీలర్లను ఖరారు చేశారు. జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఆర్‌వీఎం పీఓ యాస్మిన్ బాష, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, సూపరింటెండెంట్ రఘురాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారీగా ఆదాయం
జిల్లాలోని నోటిఫై చేసిన మద్యం దుకాణాల కోసం వచ్చిన 1,217 దరఖాస్తుల ద్వారా రూ.3 కోట్ల 4 లక్షల 25 వేలు ఆదాయం వచ్చింది. ఇక లెసైన్సు ఫీజు ద్వారా సంగారెడ్డి యూనిట్ పరిధిలో 85 దుకాణాలకు రూ. 40 కోట్ల 70 లక్షలు, మెదక్ యూనిట్ పరిధిలో 74 దుకాణాలకు రూ.25 కోట్ల 67 లక్షల 50 వేలు... మొత్తంగా రూ.64 కోట్ల 57 లక్షల 50 వేలు ఆదాయం సమకూరింది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. దుకాణాలు దక్కించుకున్న వారంతా ఏడు రోజుల్లోగా నిబంధనల పూర్తి చేసి లెసైన్సులు పొందాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలు మళ్లీ ప్రారంభమవుతాయి.
కార్యాలయ ఆవరణలో సందడి
మద్యం దుకాణాలకు డీలర్ల ఎంపిక సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జనం కిక్కిరిసిపోయారు. దరఖాస్తు చేసుకున్న వారంతా భార్యాపిల్లలతో సహా తరలిరావడంతో కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు కూడా ఉండడంతో...వారు తమ బంధువులను వెంటబెట్టుకుని వచ్చారు. డ్రా ప్రారంభించగానే దరఖాస్తు దారులంతా అదృష్టం తమను వరిస్తుందా,..లేదా అంటూ ఉత్కంఠకు గురయ్యారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో డీఎస్పీ వెంకటేష్, సీఐలు కె.శివశంకర్‌నాయక్, శ్యామల వెంకటేష్, శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.