విధిగా ధరల పట్టికను ప్రదర్శించడం.. మందు పోసే విధానంలో అక్రమాలను అరికట్టడం.. నకిలీ మద్యానికి చెక్‌పెట్టడం.. సిండికేట్, అనుమతి లేని సిట్టింగ్‌లకు స్వస్తి చెప్పడం.. ధరలను అదుపు చేయడం.. మద్యం దుకాణాలపై పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు వ్యాపారులు చేస్తున్న ఇటువంటì అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను తెరమీదకు తెచ్చి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పూనుకుంది. యాప్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్‌ల ధరలను పొందుపరచగా.. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మద్యం ప్రియులకు త్వరలోనే అవగాహన కల్పించేందుకు.. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.
ఖమ్మం, వైరా: మద్యం దుకాణాల్లో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి మద్యం షాపులో యజమాని రెండు సీసీ కెమెరాలను రికార్డింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఆ సొమ్మును ఎలాగోలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. కల్తీ మద్యంతోపాటు ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయిస్తున్నారు. సిట్టింగ్‌లు అనుమతి లేకుండా నిర్వహించడంతోపాటు కౌంటర్ వద్దే మద్యం ప్రియులకు పెగ్గుల ద్వారా మద్యం విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఎక్కువ సమయం వరకు వైన్ షాపులు, బార్లు తెరిచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ కళ్లెం వేసేందుకే ప్రభుత్వం ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలో లభించే 880 లిక్కర్ బ్రాండ్ల ధరలు పొందుపరిచారు. విస్కీ, బ్రాందీ, రమ్, బీరు.. ఇలా రకాలవారీగా వివరాలున్నాయి. యాప్‌లోకి వెళ్లి కావాల్సిన మద్యం రకంపై క్లిక్ చేసి.. సైజులు నమోదు చేస్తే మద్యం ధర ఫోన్ తెరపై వెనువెంటనే ప్రత్యక్షమవుతుంది.
ఫిర్యాదు చేయడం ఇలా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 162 మద్యం దుకాణాలను ఇటీవలే లక్కీడిప్ ద్వారా సొంతం చేసుకున్నారు. కొందరు పట్టణ ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు నాసికరమైన మద్యాన్ని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నింటినీ నిరోధించడం.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు దుకాణం యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన వాట్సప్ నంబర్ 7989111222కు ఫిర్యాదు చేయొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2533కు ఉచిత ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా హైదరాబాద్‌లోని ప్రధాన కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఫిర్యాదుదారు తన ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో ప్లేస్టోర్ ద్వారా ‘లిక్కర్ ప్రైస్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే యాప్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అ«ధికారులు అధికారికంగా విడుదల చేసిన విషయం విదితమే.
ధరల పట్టిక తప్పనిసరి..
కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రతి దుకాణంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దుకాణాల ఎదుట ధరల పట్టిక కూడా ఉంచాలి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలు, 5 బీర్ బ్రాండ్ల ధరలు పట్టికపై ముద్రించాలి. 12 నెలల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ బ్రాండ్ల ధరలను పట్టికపై ముద్రిస్తారు. ఇది మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో ఉండేలా.. తెలుగులో ప్రతి బ్రాండ్ ఎమ్మార్పీని పొందుపరచాల్సి ఉంటుంది. మద్యం దుకాణం పేరు, గెజిట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.
అవగాహన కల్పిస్తాం..
మద్యం దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు తలెత్తకుండా యాప్ ఉపయోగపడుతుంది. ఇటీవలే యాప్‌ను అధికారంగా విడుదల చేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మూడు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపడతాం. బాధితులకు న్యాయం చేస్తాం. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగకరం. మద్యం ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సోమిరెడ్డి,ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment