టోకెన్ నంబర్లు తయారు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బంది
సాక్షి, ఖమ్మం: మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దరఖాస్తుదారుల్లో కొందరికి అదృష్టం తలుపు తట్టగా.. మరికొందరిని దురదృష్టం వెక్కిరించింది. నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రారంభించారు. ఈసారి డ్రా ప్రక్రియ సాయంత్రం 3.30 గంటలకే ముగిసే విధంగా ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేయడంతో సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 89 మద్యం దుకాణాలకు 4,303 దరఖాస్తులు రాగా.. వాటిలో సుమారు వెయ్యి మంది వరకు మహిళలు దరఖాస్తు చేయడం విశేషం.
పాత సిండికేట్లకు భంగపాటు..
కొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో దాదాపు 10 నుంచి 12 షాపులు దక్కించుకోవడంతో ఈసారి కూడా వారు తమకు అదృష్టం తలుపు తడుతుందనే ఆశతో ఎదురుచేశారు. అయితే సిండికేట్‌లో 70 దరఖాస్తులు వేయగా.. ఒక్క షాపు కూడా దక్కలేదు. మరికొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పారు. ఈసారి కూడా అలాగే భావించి 104 దరఖాస్తులు వేయగా.. వారికి కేవలం 3 షాపులు మాత్రమే దక్కాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
కొత్తోళ్లకు కలిసొచ్చిన అదృష్టం..
గత ఏడాది మద్యం షాపులలో ఒక్క షాపు కూడా దక్కని సిండికేట్లు ఈసారి మద్యం షాపుల డ్రాలో మంచి షాపులను దక్కించుకున్నారు. దీనికితోడు కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు సిండికేట్లు గా ఏర్పడి వచ్చిన వారికి సైతం ఆశ్చర్యకరంగా వైన్ షాపులు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాగే మరికొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తే వైన్ షాపు దక్కుతుంది.. లేదంటే రూ.2లక్షలు పోతాయని రంగంలోకి దిగిన సుమారు 20 మందిలో ఐదుగురికి వ్యాపారం బాగా నడిచే ఎ–1 దుకాణాలు దక్కడం విశేషం.
డ్రాలో మహిళలు
ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలు డ్రా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికితోడు చాలా మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డ్రా జరిగే సీక్వెల్ ప్రాంతానికి జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచే చేరుకున్నారు. వీరిలో చంటిపిల్లలతో సైతం డ్రాలో పాల్గొనేందుకు వచ్చారు.
ఇతర ప్రాంత వ్యాపారుల హవా..
జిల్లాలో మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న 27 మద్యం దుకాణాల్లో 20కిపైగా ఇతర ప్రాంతాల వారే దక్కించుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–2 ప్రాంతాల్లో సైతం ఇక్కడి వారితో సిండికేట్ అయి మొత్తం 30కిపైగా మద్యం షాపులను దక్కించుకున్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా ప్రాంతాలకు చెందిన వారికి షాపులు అధికంగా దక్కాయి.
ఎక్సైజ్ శాఖకు రూ.6,43,75,000 ఆదాయం
జిల్లాలో 89 షాపుల డ్రా ప్రక్రియ ద్వారా ఎక్సైజ్ శాఖకు లైసెన్స్ ఫీజు కింద రూ.6,43,75,000 ఆదాయం లభించింది. 41 షాపులకు రూ.55లక్షలు సంవత్సరానికి ఫీజు ఉండగా.. ఇందులో మొదటి విడతగా 8వ వంతు లైసెన్స్ ఫీజు కింద రూ.2,81,87,500 ఆదాయం రాగా.. 33 షాపుల కు రూ.65లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.2,68,12,500 వచ్చాయి. మరో 15 షాపులకు రూ.50లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.93,75,000 వచ్చాయి.
ఈసారి ఈఎండీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం షాపును కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరాములు దక్కించుకున్నాడు. దీనికి 132 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మొదట ఎక్సైజ్ స్టేషన్–1కు డ్రా తీయగా.. పాశంగులపాటి కృష్ణారావు అనే వ్యక్తి ఈ షాపును దక్కించుకున్నాడు.
మహిళల్లో మొదటి షాపుగా షాపు నం–4ను మౌనిక దక్కించుకుంది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మద్యం షాపుల టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ఆయనకు షాపు దక్కలేదు. అలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేసి.. ఎటువంటి అనుభవం లేకుండా మొదటిసారిగా షాపులు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తామని.. తమకు ఆ షాపులు ఇవ్వాలని కొందరు తలపండిన మద్యం వ్యాపారులు బేరసారాలు కొనసాగించినట్లు తెలిసింది.
డ్రా జరిగే హాలుతోపాటు బయట కూడా ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి డ్రా ప్రక్రియను అందరూ చూసేలా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హాల్‌లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. డ్రా ప్రక్రియలో కలెక్టర్ కర్ణన్‌తోపాటు సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, ఏసీపీ వెంకట్రావు, ఎక్సైజ్ ఏఈఎస్ సైదులు, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1 సీఐ రాజు, ఎౖMð్సజ్ సీఐలు సర్వేశ్వరరావు, రమ్య, జుల్ఫీకర్, పోశెట్టి తదితర సిబ్బంది పాల్గొనగా.. ఖమ్మం వన్‌టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment