- బార్ల లైసెన్సులు రెన్యూవల్ గడువు ఏడాది
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం ఖరారు కాని నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల (ఎ4 షాపులు) లైసెన్సుల గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో లైసెన్సు గడువు ముగుస్తున్నందున జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల యజమానులు హోలోగ్రామ్ లేబుల్స్‌ను రీడ్ చేసేందుకు అవసరమైన మిషనరీని కొనుగోలు చేయాలని సూచించారు.
బార్లకు సంబంధించి 2బి బార్ల వార్షిక లైసెన్సు రెన్యూవల్ చేయించుకోవాలని సూచిస్తూ మరో జీవో జారీ చేశారు. 2015- 16 సంవత్సరం కోసం జులై ఒకటో తేదీ నుంచి లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని పేర్కొన్నారు. నాలుగు స్లాబుల్లో ఈ లైసెన్సులు ఉంటాయని, 50వేల జనాభా లోపు మునిసిపాలిటీ/ నగర పంచాయితీల్లో రూ. 25 లక్షలు, 50వేల పై నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 35 లక్షలు, 20 ల క్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రూ. 38 లక్షలు , 20లక్షల జనాభా పైబడిన నగరాల్లో రూ. 35 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ ఎక్సైజ్ రూల్స్- 2012ను తెలంగాణకు వర్తింజేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
మద్యంషాపుల లైసెన్స్ గడువు 3 నెలలు పొడిగింపు
Published Mon, Jun 29 2015 8:00 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement