పోటాపోటీ
నల్లగొండ : జిల్లాలో మద్యం దుకాణాలు సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పెద్దఎత్తున పోటీ పడ్డారు. గడిచిన రెండేళ్ల పాలసీతో పోలిస్తే ఈ దఫా ప్రభుత్వం నిర్ణయించిన ఏడాది పాలసీకి వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 2012-14కు సంబంధించి అప్పట్లో 241 దుకాణాలకు 3,990 దరఖాస్తులు వస్తే.. ఈ సారి 2014-15 సంవత్సరానికి 3,697 మంది వ్యాపారులు దరఖాస్తు చేశారు. మద్యం డ్రాలో పాల్గొనేందుకు ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరావత్తు రూ.25,000లు. ఈ లెక్కన వచ్చిన దరఖాస్తులతో ప్రభుత్వ ఖజానాకు రూ.9 కోట్ల 24 లక్షల 25 వేల ఆదాయం వచ్చింది. జిల్లాలో మొత్తం 255 దుకాణాలకు గాను బీబీనగర్ మండలం మర్యాల మినహా మిగతా 254 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. మర్యాల దుకాణం రోజు వారీ మద్యం అమ్మకాలు కనీసం రూ.30 వేలకు మించి ఉండకపోవడంతో అక్కడ టెండరు వేసేందుకు వ్యాపారులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ ఒక్క దుకాణానికి రీటెండరు పిలుస్తారు.
బినామీల జోరు..
ఈ సారి జరిగిన మద్యం టెండర్లలో బినామీలు ఎక్కువగా పోటీ పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల తరఫున బంధువులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. సూర్యాపేట, హుజూర్నగర్, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బినామీలు ఆయా నియోజకవర్గాల పరిధిలోని దుకాణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికి 10 నుంచి 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట, నకిరేకల్‌లో మాజీ ప్రజాప్రతినిధులకు చెందిన సిండికేట్‌ను దెబ్బతీసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బినామీ పేర్లతో బరిలో దిగినట్లు వినికిడి. ఇక సూర్యాపేటలో బార్ల యజమానులు సిండికేట్‌గా ఏర్పడినట్లు తెలుస్తోంది. వీరంతా సిండికేట్ మాయాజాలంతో మూకుమ్మడిగా దరఖాస్తులు వేశారు. బీర్ల అమ్మకాలకు సంబంధించి ముందస్తు ఒప్పందం చేసుకుని రంగంలోకి దిగినట్లు సమాచారం. లక్కీ డ్రాలో దుకాణాలు దక్కితే.. బీర్లు దుకాణాల్లో అమ్మకుండా ఆ సరుకు మొత్తాన్ని బార్లకు తరలించే విధంగా ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. హోల్‌సేల్‌కు మాత్రమే బీర్లును అమ్మి రిటైల్‌కు వచ్చే సరికి దుకాణాల్లో కూల్ బీర్లు అమ్మకాలు లేకుండా చేయాలన్నది వారి ప్లానింగ్. దీని వల్ల మందు బాబులు గత్యంతరం లేక బార్లను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. దీనిని అదునుగా చూసుకుని బార్లలో బీర్ల ఎమ్మార్పీలను అమాంతగా పెంచేసి సొమ్ము చేసుకోవాలనే పక్కాప్లాన్‌తో ఉన్నట్లు తెలిసింది.
సీమాంధ్రుల కన్ను..
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీ ఖరారు కాకపోవడంతో ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి వ్యాపారులు మన జిల్లా పై కన్నేశారు. దీంతో ఆయకట్టు ప్రాంతాల్లోని దుకాణాలకు భారీ దరఖాస్తులు రావడానికి ఇదే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. అయితే శనివారం సాయంత్రం ఏపీ పాలసీ ప్రక టించారు. అక్కడ పాలసీ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో వ్యాపారులు మన జిల్లా పైదృష్టి పెట్టారు. హుజూర్‌నగర్‌లో 17 దుకాణాలకు 728 , కోదాడలో 14 దుకాణాలకు 258, మిర్యాలగూడలో 20 దుకాణాలకు 294 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ తీవ్రత ఎంత ఉందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. అదీగాక ఇక్కడ అనధికారికంగా పేకాట క్లబ్‌లు కూడా నిర్వహిస్తుండటంతో మద్యం వ్యాపారం లాభసాటిగా ఉంటుందని గమనించి పోటీ పడి మరీ టెండర్లు వేశారు.
వ్యాపారుల్లో ఉత్కంఠ
అధికార, ప్రతిపక్ష పార్టీలు అనూహ్యంగా బరిలో దిగడంతో వ్యాపారుల్లో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. ఏడాది పాలసీకి వందల సంఖ్యలో దరఖాస్తులు రావడం పట్ల ఆందోళన నెలకొంది. సోమవారం జిల్లా కేంద్రంలో దుకాణాలు కేటాయించేందుకు లక్కీ డ్రా ని ర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు టౌన్ హాల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదు గా డ్రా తీస్తారు. తొలుత సింగిల్ దుకాణాల టెండర్లు తెరుస్తారు. ఆ తర్వాత మున్సిపాల్టీలు, మండలాల్లోని దుకాణాల టెండర్లును డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. జుల్ 1 నుం చి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది.