కష్టపడి చదివారు.. ఉద్యోగం రాలేదు. నిర్ణీత వయస్సు దాటిపోతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థ్థితి. కొలువుమీద ఆశ వదులుకునే దశలో వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశలు కల్పించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపడంతో పాటు ఉద్యోగాలకు నిర్ణీత వయస్సునూ మరో ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. దీంతో వేలాదిమందికి ఆశలు చిగురించాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: కొత్తరాష్ట్రంలో నిరుద్యోగుల కోటి ఆశలు నెరవేరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల వయో పరిమితిని ఐదేళ్లు పెంచడంతో నిరుద్యోగుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఐదేళ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లూ జారీకాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు సర్కా రు ప్రకటన ఊరట కలిగించింది.
త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటివరకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదైన వారిని బట్టి 1,61,546 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో పదో తరగతి చదివిన వారు 59,129 మంది, ఇంటర్‌మీడియట్ పూర్తిచేసిన వారు 31,168 మంది, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదివిన వారు 31,183మంది ఉన్నారు.
అలాగే వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన వారు 36,758 మంది ఉన్నారు. వీరికి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఒక్క కాల్ లెటర్ కూడా వెళ్లలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నత చదువులు పూర్తి చేసుకుంటున్న వారు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఐదారేళ్లుగా పేర్లు నమోదులో భారీగా తగ్గిపోయింది.
భారీగా పేరుకుపోయిన ఖాళీలు
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారీ కొలువుల కోసం కొంతకాలంగా ఎలాంటి నోటిఫికేషన్లూ లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.నాలుగైదు ఏళ్లుగా పదవీ విరమణ పొందినవారి సంఖ్య అదేస్థాయిలో ఉండడంతో ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. జిల్లాలో మొత్తం 84 శాఖల్లో కూడా ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పోలీస్‌శాఖ మినహా మిగతా వాటిన్నింటిలో కలిపి జిల్లాలో దాదాపు 2,400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీటిలో అత్యధికంగా పాఠశాల విద్యశాఖలో అత్యధికంగా 1,600 పోస్టులు ఖాళీలున్నాయి. అలాగే వైద్యారోగ్యశాఖలో 600, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 260, రెవెన్యూశాఖలో 260, పశుసంవర్థక శాఖలో 55పోస్టులు ఖాళీలున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం ఇటీవల ఆదర్శరైతులను తొలగించింది. కాగా, వారిస్థానంలో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్)లను నియమించనున్నట్లు ప్రకటించింది.
దీంతో దాదాపు రెండు వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లూ పుస్తకాలను దూరం పెట్టిన వారు తిరిగి కోచింగ్ సెంటర్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు ప్రభుత్వ ప్రకటించడంతో బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెవెన్యూ ఉద్యోగాల ఖాళీలు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో గ్రూప్స్ కోచింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ పయనమవుతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ..
రాష్ట్ర పరిధిలోని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,800మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా డ్వామాలో 1,725, ఆర్వీఎంలో 845, డీఆర్‌డీఏలో 275, విద్యుత్‌శాఖలో 320మంది పనిచేస్తున్నారు. అయితే ఏయే శాఖల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తారనే విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగసంఘాలు మాత్రం అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు.
విద్యార్హతల వారీగా..
విద్యార్హత నిరుద్యోగులు ఐదేళ్ల
సడలింపుతో లబ్ధి
10వ తరగతి 59,129 72,112
ఇంటర్ 31,168 41,317
డిగ్రీ, పీజీ 31,183 45,734
వృత్తివిద్యాకోర్సు 36,758 52,007
ఆశల పల్లకిలో..
Published Fri, Nov 28 2014 4:15 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement