సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు దశలవారీగా కొనసాగుతున్న లాక్‌డౌన్.. మరోవైపు ఏ మాత్రం తగ్గని కరోనా ఉధృతి.. ఇప్పటికే యాభై రోజులకు పైగా నగరవాసులు గడప దాటకుండా ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని రకాల ఉద్యోగ, వ్యాపారాలకు సడలింపు లభించినా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయారు. క్యాబ్‌డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు మొదలుకొని అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది చిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ వర్గాలు నాలుగో దశ లాక్‌డౌన్‌పై ఒకింత అసహనాన్నే వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ జీవితంలో భాగమైనప్పుడు లాక్‌డౌన్‌తో కట్టడి చేయడం ఏ మాత్రం సాధ్యం కాదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గృహిణులు, మహిళా ఉద్యోగులు తదితర అన్ని వర్గాలు కోవిడ్ సహిత సరికొత్త జీవన విధానంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు. అనివార్యంగా మారిన వైరస్ వ్యాప్తి దృష్ట్యా దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నాలుగో దశలో మరిన్ని మార్పులు, సడలింపులు లభించవచ్చు. మరిన్ని దశల్లో లాక్‌డౌన్ కొనసాగించినా కరోనా ఉధృతిని నియంత్రించలేనప్పుడు ఆ వైరస్‌తో కలిసి జీవించే నూతన జీవనశైలి పట్ల విస్తృత అవగాహన కల్పించాలని వివిధ వర్గాలకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.
ఆటోలకు అనుమతి ఇవ్వాలి
లాక్‌డౌన్ వల్ల ఆటోడ్రైవర్లు ఇప్పటికే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం అసాధ్యంగా మారింది. ఒక ఆటోలో ఇద్దరు ప్రయాణికులను భౌతిక దూరానికి అనుగుణంగా అనుమతించాలి. శానిటైజర్లు వినిగించి ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉండాలి. పొరుగు రాష్ట్రంలో ఇచ్చినట్లుగా ఆటోడ్రైవర్లకు రూ.5,000 చొప్పున సహాయం అందించాలి.– ఏ.సత్తిరెడ్డి, ఆటో సంఘం నాయకుడు
కళాకారులను ఆదుకోండి
పెళ్లిళ్లు, వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రాలు నిర్వహించే సంగీత కళాకారులు, గాయకులు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నిత్యావసర వస్తువుల కోసం దాతలను ఆర్థించాల్సి వస్తోంది. రెండు నెలల క్రితం వరకు కళలను నమ్ముకొని బతికిన వాళ్లం ఇప్పుడు దుర్భరంగా బతుకున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. – అనురాధ, గాయని
క్యాబ్‌లను అనుమతించాలి
నాలుగో విడత లాక్‌డౌన్‌లో కూడా క్యాబ్‌లను అనుమతించకపోతే డ్రైవర్లు, వారి కుటుంబాలు బతకడం దాదాపు అసాధ్యం. ఇప్పటికైనా క్యాబ్‌లపై ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించి.. అందుకు అనుగుణంగా తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఓలా, ఉబెర్ వంటి సంస్థలు, ఐటీ పరిశ్రమలు చొరవ తీసుకోవాలి. సింగిల్ బుకింగ్–సింగిల్ ప్యాసింజర్‌పై నిర్ణయం తీసుకోవాలి. – షేక్‌సలావుద్దీన్, క్యాబ్ డ్రైవర్స్ ప్రతినిధి
మరింత అవగాహన కల్పించాలి
రెండు నెలలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు చేయిచాచకుండా బతికిన వాళ్లు వీధుల్లోకి వచ్చి అడుక్కుంటున్నారు. లాక్‌డౌన్ అదేపనిగా పొడిగించడం వల్ల సాధారణ, మధ్యతరగతి వర్గాలను కూడా అడుక్కొనే స్థాయికి నెట్టినట్లవుతుంది. అలా కాకుండా కోవిడ్‌తో కూడిన జీవన విధానంపై ప్రభుత్వం మార్గనిర్ధేశం చేయాలి. భౌతిక దూరం, మాస్కుల అమలుతో ఇంకా ఏం చేయవచ్చో అవగాహన కల్పించాలి. పనివేళల్లో మార్పులు అవసరం. సినిమాలు, షికార్లు వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. – సుధ, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment