లారీల వల్ల లేస్తున్న దుమ్ముతో ఇబ్బంది పడుతున్న దృశ్యం
‘తెల్లందాక...పొద్దుందాక లారీలే. దుమ్ము, దూళీతో వసపడుతలేదు. దగ్గు, దమ్ము రోగాలొస్తున్నాయ్. కనీసం తిండి కూడా సరిగ్గా తినేటట్లు లేదు. నీళ్లన్నా సల్లిపీయమంటే ఇంటలేరు. ఇంట్లకెల్లి కాలు బయటపెడుదామంటే భయమైతంది. ఊల్లె సర్పంచ్‌కు చెప్పినం. కలెక్టర్‌కు కూడా చెప్పినం. అయినా పట్టించుకున్నోళ్లు లేరు’ అంటూ పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లారీలను నిలిపివేసి, గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బుధవారం రాస్తారోకో చేశారు.
సాక్షి, పెద్దపల్లి: జిల్లా ప్రజానీకానికి లారీలు నిత్యం నరకం చూపిస్తున్నాయి. ఓవర్‌లోడ్, మితిమీరిన వేగంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తిరుగుతుండడంతో నిత్యం దుమ్ము, దూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్లు అధ్వానంగా మారాయి. షరామామూలుగానే అధికారులు లారీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా ప్రతి రోజు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రత్యక్ష నరకం
ఇసుక క్వారీలు, కంకర క్వారీలు, క్రషర్ల మూలంగా జిల్లాలో వేలాది లారీలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, పెద్దపల్లి, రామగిరి, కమాన్‌పూర్, మంథని మండలాలకు చెందిన ప్రజలకు లారీలతో కంటిమీద కునుకులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లా కాసిపేట, సిరిపురం, గోలివాడ, మేడారంలలో పంప్‌హౌస్, బ్యారేజీలు, టన్నెల్‌ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు అవసరమైన కంకర, ఇసుకను సరఫరా చేసేందుకు ప్రతి రోజు వందలాది లారీలు తిరుగుతున్నాయి. అలాగే జిల్లాలోని జయ్యారం, కన్నాల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో కంకరక్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వందలాది లారీలు నిత్యం కంకరలోడ్‌తో వెళ్తుంటాయి.
ఓవర్‌లోడ్‌పై నియంత్రణేది?
జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 90శాతం మితిమీరిన వేగం, ఓవర్‌లోడ్‌తోనే కావడం గమనార్హం. ఓవర్‌లోడ్‌తో లారీలు వెళ్లడంతో రోడ్లు అధ్వానంగా మారడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారితోపాటు పాలకుర్తి, పెద్దపల్లి శివారు గ్రామాల్లో తరచూ లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్‌లోడ్, అతివేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఒక్క లారీకి జరిమానా విధించిన సంఘటనలు లేవు.
ఓవర్‌లోడ్ నియంత్రణకు స్పెషల్‌డ్రైవ్
లారీల ఓవర్‌లోడ్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. సాధారణ చెకింగ్‌లతోపాటు, ఈ స్పెషల్ డ్రైవ్ గురువారం నుంచి జిల్లాలో అమలవుతుంది. ఎక్కడా ఓవర్‌లోడ్‌తో లారీలు దొరికినా, కేసులు బుక్ చేస్తాం. ఓవర్‌లోడ్‌ను ఖచ్చితంగా నియంత్రిస్తాం.
– వై.కొండాల్‌రావు,
జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీవో)
దుమ్ముతోటి రోగాలత్తాన్నయి
లారీల తిరుగుతుండడంతో రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేస్తోంది. రోడ్డును ఆనుకుని ఉన్న ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దగ్గు, దమ్ము వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రుల్ల వేల రూపాయలు ఒడుస్తున్నయి. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలి. కొత్త రోడ్డు పనులు త్వరగా చేయాలి.
– బత్తిని లక్ష్మి, పుట్నూర్
తిండి తినలేకపోతున్నాం
రహదారికి ఇరువైపులా పొక్లెయిన్‌తో తవ్వి వదిలేశారు. మా గ్రామం మీదుగా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తున్న వందలాది లారీలతో తీవ్రమైన దుమ్ము వస్తున్నది. దీనిపైన గ్రామ సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినం. దుమ్ముతో కనీసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నాం. మా బాధ పట్టించుకున్నోళ్లు లేరు.
– బద్రి లక్ష్మి, పుట్నూర్
Comments
Please login to add a commentAdd a comment