సాక్షి, హైదరాబాద్: మందులు వేసుకోకుండా పాటించిన డైట్ చిట్కాలు చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. ఓ ఆయుర్వేద వైద్యుడు చెప్పిన డైట్ చిట్కాలు పాటిస్తూ వేళకు మందులు వేసుకోకపోవడంతో అస్వస్థతకు గురైంది. దీంతో బంధువులు ఆమెను చికిత్స కోసం బుధవారం నిమ్స్‌కు తరలించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మేన కోడలు అలివేలు(45) మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతోంది.
బరువు తగ్గేందుకు ఓ ఆయుర్వేద వైద్యుడి సూచన మేరకు గత 31 రోజుల నుంచి డైట్(దీనిలో భాగంగా కొబ్బరినూనె తాగినట్లు తెలిసింది) పాటిస్తోంది. చిట్కాలు పాటిస్తూ ఇన్సులిన్ వాడకపోవడం వల్లే షుగర్ లెవల్స్ 450 ఎంజీకి పెరిగాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వైద్యులు తగిన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా, అలివేలును కడియం శ్రీహరి గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే సదరు ఆయుర్వేద వైద్యుడు సూచించిన చిట్కాలు వికటించి కేవలం 35 రోజుల్లో నలుగురు బాధితులు నిమ్స్‌లో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment