రుణ మాఫీకి అడుగులు | Loan maphiki feet | Sakshi
Sakshi News home page

రుణ మాఫీకి అడుగులు

Published Thu, Aug 21 2014 2:24 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

రుణ మాఫీకి అడుగులు - Sakshi

రుణ మాఫీకి అడుగులు

  •     ప్రక్రియ ప్రారంభించిన యంత్రాంగం
  •      మాఫీ కానున్న రుణాలు రూ.1656 కోట్లు
  •      లబ్ధిపొందనున్న 3.19 లక్షల మంది రైతులు
  •      ఈ నెల 26లోపు అర్హుల ముసాయిదా జాబితా
  •      27 నుంచి 29 వరకు అభ్యంతరాల స్వీకరణ
  •      30న తుది జాబితా వెల్లడి
  •      ఒక కుటుంబానికి వడ్డీతో కలిపి గరిష్టంగా లక్ష రూపాయలు మాఫీ
  •      మార్గదర్శకాలను వివరించిన కలెక్టర్ కిషన్
  • సాక్షిప్రతినిధి, వరంగల్ :  ప్రాథమిక అంచనాల ప్రకారం.. పంట రుణాల మాఫీకి అర్హత పొందే రైతులు జిల్లాలో 3.19 లక్షలు ఉన్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. రూ.1656 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. మొత్తం రుణాల్లో రూ.1396 కోట్లు పంట రుణాలుగా.. రూ.260 కోట్లు బంగారు ఆభరణాలపై పంట రుణాలు ఉన్నాయని తెలిపారు. తుది జాబితా వచ్చాక దీంట్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. తర్వాత బ్యాంకర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

    అనంతరం రుణమాఫీపై విలేకరుల సమావేశం నిర్వహించారు. పంట రుణాల మాఫీ ప్రక్రియను ఈ నెల 31తో ముగించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రుణ మాఫీకి అర్హులైన వారి జాబితాను ఈ నెల 30లోగా పూర్తి చేయనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ మాఫీ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. 2014 మార్చి 31 వరకు రైతులు తీసుకున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు.

    ఈ ఏడాది మార్చి 31 వరకు వడ్డీతో కలిపి ఒక కుటుంబానికి గరిష్టంగా లక్ష రూపాయలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 2014 మార్చి 31 వరకే ప్రభుత్వం వడ్డీని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత రుణాలు చెల్లిస్తే.. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణమాఫీ అర్హత పొందేందుకు ఏం చేయాలనే విషయంపై రైతులు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించాలని సూచించారు. పంట రుణాల మాఫీ ప్రక్రియకు ఏ, బీ, సీ, డీ నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
         
    ఫార్మాట్-ఏలో భాగంగా మార్చి 31, 2014 వరకు స్పల్పకాలిక పంట రుణాలు పొందిన రైతుల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తారు.
         
    ఫార్మాట్-బీలో గ్రామాల వారీగా  2014, మార్చి 31 వరకు బంగారు ఆభరణాలపై రైతులు తీసుకున్న స్పల్పకాలిక పంట రుణాల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తారు.
         
    ఫార్మాట్-సీలో భాగంగా.. ఏ, బీ ఫార్మాట్లతో వచ్చిన జాబితా ఆధారంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష రుణ పరిమితి విధిస్తూ మరో జాబితా రూపొందిస్తారు. ఏ, బీ, సీ ఫార్మాట్లను ప్రతి బ్యాంకు ఆధికారి ఈ నెల 23లోగా సిద్ధం చేయాలి.
         
    ఫార్మాట్-డీలో భాగంగా.. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను ఈ నెల 24 నుంచి 26 వరకు మండల స్థాయి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి దీన్ని పూర్తి చేస్తారు. ఈ సమావేశాలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ప్రత్యేక పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.
         
    ఫార్మాట్-ఈలో భాగంగా.. సీ, డీ జాబితాలను పరిశీలించి గ్రామాల వారీగా పంట రుణాల మాఫీకి అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తారు. బ్యాంకుల శాఖల, పంచాయతీ కార్యాలయాల ముందు వీటిని ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జాబితాలపై వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తారు. రుణమాఫీకి అర్హులైన రైతుల తుదిజాబితాను రూపొందించి రికార్డు చేస్తారు. పంట రుణాల మాఫీ కోసం ఈ జాబితాలను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు.
     
    జిల్లా అధికారులతో సమావేశం...
     
    జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి 3.20 లక్షల బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. మండలాల వారీగా నిర్వహించే సమావేశాలకు బ్యాంకుల తరఫున కన్వీనర్లను నియమించాలని జిల్లా లీడ్ బ్యాంకు అధికారిని ఆదేశించారు. మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని ప్రకటించారు.

    ఒక కుటుంబానికి చెందిన రైతు.. వివిధ బ్యాంకులలో పంట రుణం పొందితే అలాంటి వారిని ఈ సమావేశాల్లో గుర్తించాలని సూచించారు. రైతులకు సంబంధించి రుణ అర్హత కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని ఆర్డీవోలను ఆదేశించారు. 2010 సెప్టెంబరు 10 నుంచి 2014 మే వరకు ప్రకృతి విపత్తులతో జిల్లాలో పంట నష్టపోయిన 1.55 లక్షల మంది రైతులకు రూ.53,45 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 61,012 హెక్టారలో జరిగిన పంట నష్టాలకు సంబంధించిన ఈ మొత్తాలను అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు ఆయన వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement