రుణం తీర్చుకుంటాం
బేషరతుగా రుణమాఫీ.. పరిమితులు లేకుండా అమలుకు కేబినెట్ నిర్ణయం
43 అంశాలపై చర్చ, పలు ఎన్నికల హామీలకు ఆమోదం
లక్షలోపు రుణాల మాఫీతో సర్కారుపై రూ. 19 వేల కోట్ల భారం
బంగారంపై రుణాలు, పాత బకాయిలకూ వర్తింపు
39 లక్షల మంది రైతులకు లబ్ధి, త్వరలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలు
అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. 40 వేల మందికి వరం
విద్యార్థులకు ఆర్థిక సాయానికి 1956 ప్రామాణికత
దళిత, గిరిజన వధువులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 50 వేల సాయం
అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఇల్లు, భూమి, ఒకరికి ఉద్యోగం
తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఓకే, కేంద్ర స్థాయిలో వేతనాలకు కమిటీ
ఎస్టీలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు
ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు వారి పంట రుణాలను బేషరతుగా మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బంగారంపై తీసుకున్న రుణాలు, పాత బకాయిలతో పాటు ఎలాంటి పరిమితులు లేకుండా.. లక్ష వరకు పంట రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు సందిగ్ధం నెలకొన్న పలు అంశాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై కేబినెట్ ఈ సందర్భంగా స్పష్టత తీసుకొచ్చింది. దాదాపు ఐదున్నర గంటలపాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో 43 అంశాలపై లోతైన చర్చ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడిస్తూ తెలంగాణపై వరాల జల్లు కురిపించారు.
రుణాలపై స్పష్టత!
లక్షలోపు రైతు రుణాల మాఫీని ఆమోదించడం వల్ల సుమారు 39,07,409 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్ తెలిపారు. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలతో పాటు ఎలాంటి పరిమితులు లేకుండా దీన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ర్ట ప్రభుత్వంపై 17 నుంచి 19 వేల కోట్ల రూపాయల మేరకు భారం పడే అవకాశముందని తెలిపారు. అయినా లెక్క చేయకుండా దీన్ని సత్వరం అమలు చేసేందుకు ఆర్థికశాఖను ఆదేశించినట్లు చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం వెల్లడించారు. దీనిపై ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 40 వేల వరకు ఉండవచ్చునని అంచనా వేసినట్లు తెలిపారు. అయితే దీనిపై తుది వివరాలు రావాల్సి ఉందన్నారు. చాలా కాలం నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అవసరమైతే వయోపరిమితికీ సడలింపు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు డిమోషన్ పొందే డీ ఎస్పీలను అదే హోదాలో కొనసాగించడానికి వీలుగా 134 సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించినట్లు చెప్పారు.
ఉద్యోగులకు వరాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖజానాపై రూ. 180 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. అలాగే వారికి కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చే అంశంపై అధ్యయనానికి రాష్ర్ట ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ దిశగాతక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రివర్గం తీర్మానించింది. సైబరాబాద్, హైదరాబాద్‌లో పోలీస్ శాఖ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించేందుకు 3,883 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ఇందుకు రూ. 340 కోట్లు మంజూరు చేసేందుకు, 3,620 మంది కానిస్టేబుళ్లు-డ్రైవర్ల నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది.
అమరుల కుటుంబాలకు అండ
1969 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నగదు సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అర్హులైన కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య సౌకర్యాలు, పిల్లలకు ఉచిత విద్య, రైతులైతే 3 ఎకరాల చొప్పున భూమి, పక్కా ఇల్లు సమకూర్చనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 2001 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించినట్లు చెప్పారు.
స్థానికత ఖరారు!
విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికత, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఈ దిశగా ఆర్థిక, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖలు మార్గదర్శకాలు రూపొందిస్తాయని ఆయన వెల్లడించారు. ఏ ఒక్క తెలంగాణ విద్యార్థికీ అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు.
దసరా నుంచి కొత్త పెన్షన్లు
వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయల చొప్పున.. వికలాంగులకు రూ. 1500 చొప్పున పెన్షన్లు చెల్లించాలని కేటినెట్ తీర్మానించింది. దీన్ని వచ్చే దసరా - దీపావళి నడుమ ఆరంభించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులోభాగంగా లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా కార్డులిచ్చి, బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటిలోనే ప్రతినెలా ఠంచనుగా పింఛన్ జమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున భృతి ఇవ్వనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అర్హులైన వారి సంఖ్యను తేల్చే బాధ్యతను కార్మిక శాఖకు అప్పగించినట్లు చెప్పారు. దాదాపు 7 లక్షల మంది ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి కొంత సమయం పడుతుందన్నారు.
రిజర్వేషన్లకు గ్రీన్‌సిగ్నల్
ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తుల నేతత్వంలో రెండు వేర్వేరు కమిటీలు వేయాలని రాష్ర్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీల అధ్యయనం, సిఫార్సుల మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే అమలు దిశగా చర్యలుంటాయని కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 500 జనాభా దాటిన ఆదివాసీలు, గిరిజనుల తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. సత్వర చర్యల కోసం పంచాయత్‌రాజ్ శాఖ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు జారీకానున్నాయి. భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీకి కూడా ఆమోదం లభించింది. ఇక కొత్తగా కల్యాణలక్ష్మి పథకం చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దీని కింద దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరఫున రూ. 50 వేలు చెల్లించనున్నారు.
వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు
సెషన్స్ జడ్జి హోదాలో కొత్తగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భారీగా అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులు- భూములకు సంబంధించిన కేసుల సత్వర విచారణ, పరిష్కారాానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్‌లో ఉండే తెలంగాణవాసులకు కేరళ ప్రభుత్వ తరహాలో అండగా నిలవడానికి ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆటోవాలాకు అండ
ఆటోరిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణాపన్నును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో 5.17 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. తద్వారా సర్కారుపై రూ. 56 కోట్ల మేర భారం పడుతుంది. రూ. 76 కోట్ల పాత బకాయిలను కూడా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పవర్‌లూం కార్మికులు తీసుకున్న రూ. 6.50 కోట్ల రుణాలనూ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది.
కొత్త యూనివర్సిటీలు - సంస్థలు
వ్యవసాయ యూనివర్సిటీని వెంటనే విడదీసి.. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామని కేసీఆర్ తెలిపారు. అలాగే తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు పేరు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ చట్టాల ప్రకారం ఏర్పడి, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 89 సంస్థలకు వెంటనే తెలంగాణ పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ను, ప్రత్యేకంగా రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
మరికొన్ని నిర్ణయాలు..
- దేవాలయ ట్రస్టీల నియామకాల విషయంలో ఆర్డినెన్స్.
- ఇప్పటికే ఆమోదించిన తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు. సత్యమేవజయతే అక్షరాలను దేవనాగరి లిపిలోకి మార్పు. సింహం గుర్తు, సత్యమేవ జయతే రెండు సమ్మిళితం చేయాలన్న కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం.
- తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ పేరు ఖరారు.
- తెలంగాణ శాసనసభకు ఆంగ్లోఇండియన్ సభ్యుడిగా రాయిడిన్‌రోచ్ పేరు ఖరారు.
- అడ్వొకేట్ జనరల్‌గా కె.రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం.
- గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసేలా వైద్య శాఖకు ఆదేశాలు
- జంటనగరాల్లో గతంలో రద్దు చేసిన కల్లుడిపోలు, సొసైటీలను పునరుద్ధరించాలని నిర్ణయం. వెంటనే అమలుకు ఎక్సైజ్ శాఖకు ఆదేశం. దసరాలోగా వాటిని తెరిపించే యత్నం.
- బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా పరిగణిస్తూ నిర్ణయం.
- పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం దేశంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానానికి రూపకల్పన. మార్గదర్శకాలు రూపొందించనున్న పరిశ్రమల శాఖ.
- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కొత్తగా మాస్టర్‌ప్లాన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల సాయం తీసుకోవాలని నిర్ణయం.
- అన్ని రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, అనుభవజ్ఞులు, జర్నలిస్టులతో కూడిన రాష్ర్ట సలహా మండలి ఏర్పాటుకు తీర్మానం. అన్ని అంశాల్లోనూ ఈ మండలి మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని నిర్ణయం. ఫలితాలను బట్టి తదుపరి దశలో జిల్లా స్థాయిలోనూ ఈ కమిటీల విస్తరణ.
మైనారిటీ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపునర్విభజన చట్టంలోని 101వ సెక్షన్ ప్రకారం ఏపీ మైనారిటీ కమిషన్ చట్టాన్ని సవరించి తెలంగాణ మైనారిటీ కమిషన్ చట్టాన్ని రూపొందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లతో మైనారిటీల అభివృద్ధికి వార్షిక ప్రణాళికను రూపొందించాలని కూడా ప్రభుత్వం మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయనున్నారు. జిల్లాసెషన్స్, సివిల్ జడ్జి స్థాయి వ్యక్తి ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిగల అధికారి సభ్యుడిగా ఉంటారు. ముస్లింలా, న్యాయ పరిజ్ఞానం ఉన్న మరోవ్యక్తి కూడా సభ్యుడిగా ఉంటారు.
మీడియాకు లీకులొద్దు..!
మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తున్న అంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించాలని.. మీడియాతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని మంత్రివర్గ సహచరులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. మీడియాకు లీకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అంతర్గత సమావేశాల్లో ఎంతైనా ఓపెన్‌గా ఉండండి. కానీ మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి సమస్యలు తేవొద్దు. మీరు కూడా సమస్యలు తెచ్చుకోవద్దు...’ అని అన్నట్లుగా సమాచారం.