నిరీక్షణకు తెర | Local bodies elections Expectation Planned | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు తెర

Published Fri, Jul 4 2014 12:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Local bodies elections Expectation Planned

నల్లగొండ :మండల పరిషత్ సభ్యుల నిరీక్షణకు తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత ఎంపీపీ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు.  2011 జూన్ 21న మండల పరిషత్‌ల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఏడాది ఎన్నికలు జరిగేంత వరకు  ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే పాలన కొనసాగింది. రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికైన సభ్యులు తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావం తర్వాత తొలి ప్రాదేశిక సభ్యుల హోదాలో మండల పరిషత్‌ల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అదే విధంగా కొత్త రాష్ట్రంలో తొలిసారిగా మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు సైతం కొలువు దీరనున్నారు.
 
 కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్
 జిల్లా వ్యాప్తంగా 59 స్థానాలకు గాను జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 25 చోట్ల సొంతంగా పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ సాధించింది. అధికార టీఆర్‌ఎస్‌కు కేవలం 3 మండలాల్లోనే పాలక వర్గాలను ఏర్పాటు చేసే మెజార్టీ ఉంది. 28 మండలాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో అధికార టీఆర్‌ఎస్ హంగ్ ఏర్పడిన మండలాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు క్యాంపు రాజకీయాలు నడిపింది. ఈ స్థానాలతో పాటు కాంగ్రెస్ మెజార్టీ ఉన్న మండలాలపైన టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మండలాల్లో గెలిచిన టీడీపీ, సీపీఎం, సీపీఐ సభ్యులను తమ వైపు లాక్కునేందుకు రాయభేరాలు నడిపింది. దీంతో కాంగ్రెస్ సొంతం కానున్న మండలాల్లోనే టీఆర్‌ఎస్ దూకుడుగానే వ్యవహరించింది. శుక్రవారం జరిగే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ రసవత్తరంగా జరగనుంది. కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్న మండలాల్లో కూడా సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చిన పక్షంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు కోరం లేక వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీలు కూడా తమ సభ్యులు చేజారి పోకుండా ఉండేందుకు ఇప్పటికే విప్ జారీ చే శాయి.
 
 టీఆర్‌ఎస్ దూకుడు..
 హంగ్ ఏర్పడిన 28 మండలాల పై టీఆర్‌ఎస్ కన్నేసింది. ఈ మండలాను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు పూర్తి చేసింది. టీఆర్‌ఎస్ శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో స్వతంత్రుల సాయంతో మండలాలను దక్కించుకుని పాలక వర్గాలను ఏర్పా టు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సంస్థాన్ నారాయణ్‌పూర్, నాంపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, గుండాల, అర్వపల్లి మండలాలపై టీఆర్‌ఎస్ దృష్టి కేంద్రీకరించింది. ఈ మండలాల్లో టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు సభ్యులు తోడైతే టీఆర్‌ఎస్ పాలకవర్గాలను ఏర్పాటు చేయడం అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement