ఇరిగేషన్‌లో ‘స్థానిక’ చిచ్చు | local controversy in irrigation | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌లో ‘స్థానిక’ చిచ్చు

Published Sun, Nov 16 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

local controversy in irrigation

257 మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను జోన్‌ల పేరిట
తెలంగాణకు బదిలీ చేసిన ఏపీ సర్కారు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీ ఉద్యోగ సంఘాలు
ఏపీ మంత్రి ఉమాకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఫోన్
విధాన నిర్ణయం చేసే వరకు ఓపిక పట్టాలంటున్న తెలంగాణ ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఇంటర్మీడియట్  బోర్డుతో పాటు అనేక అంశాల్లో ఇప్పటికే ఎడతెగని సమస్యలు ఉండగా.. తాజాగా సాగునీటి శాఖలో ‘స్థానికత’ చిచ్చు రేపుతోంది. తెలంగాణకు సంబంధించి 5, 6 జోన్‌ల కింద ఉద్యోగాలకు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లోని 1, 2, 3, 4 జోన్లలో పనిచేస్తున్న 257 మంది ఇంజనీర్లను సొంత జోన్‌లకు వెళ్లిపోవాలంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి కారణం అవుతున్నాయి. ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో 5, 6 జోన్లలో ఎంపికైనా తర్వాత వారిలో చాలామంది బదిలీపై వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎంపికైంది 5, 6 జోన్లలో అయినా తాము ఆంధ్ర  ప్రాంతంలోనే పనిచేస్తామని వారు అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం వారంతా... 257 మంది అధికారులు ఇక్కడ చేరితే 5, 6 జోన్‌లలో పని చేస్తున్న తమ పదోన్నతుల అవకాశాలు దారుణంగా దెబ్బతిం టాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంటున్నారు.
 
 ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ తుది నిర్ణయం తీసుకునే వరకూ ఓపిక పట్టాలని తాము కోరుతున్నా ఏపీ ప్రభుత్వం తన పంథా మార్చుకోలేదంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనూ ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానిపై అభ్యంతరం తెలుపుతూ మంత్రి హరీశ్ స్వయంగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుకు లేఖ రాశారు. అయితే తుపాను సహా యక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహిద్దామని దేవినేని ప్రతిపాదించారు. అలాంటి సమావేశమేమీ ఇప్పటిరవకు జరుగలేదు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సమావేశం నిర్వహణకు తెలంగాణ సిద్ధమవుతున్న తరుణంలో.. తాజా గా ఏపీ జారీ చేసిన ఉత్తర్వు మరో వివాదానికి కారణమైందని తెలంగాణ ప్రభుత్వం అంటోం ది. 1,2,3,4 జోన్లలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానిక ఉద్యోగులను ఆంధ్రాకు పంపించడంలో తామెలాంటి ఒత్తిడి చేయబోమని చెబుతోంది. వారు ఇక్కడే పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తోంది.
 
 ఏపీకి నిరసన తెలిపిన తెలంగాణ
 
 తమతో సంప్రదించకుండానే ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న ఇంజనీర్లను బదలాయింపు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం ఏపీ మంత్రి దేవినేని ఉమతో ఫోన్‌లో మాట్లాడారు. అధికారుల బదలాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. బదలాయింపు చేసిన ఉద్యోగులందరికీ రిలీవ్ లెటర్లు అందజేసి, తక్షణమే సంబంధిత జోన్లను వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావుతో కూడా తెలంగాణ అధికారులు సంప్రదించారు. బదిలీలను ఆపాలని కోరుతూ.. ఏకపక్ష నిర్ణయంపై నిరసనను తెలియజేశారు. ఉద్యోగుల బదిలీ అంశాన్ని చట్ట పరిధిలో కాకుండా.. మానవతా దృక్పథంతో చూడాల్సి ఉంటుందని, దీనిపై తదుపరి చర్చలు జరిపే వరకూ ఎలాంటి బదిలీలు చేయరాదని ఏపీ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా విధాన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బదిలీలు చేయరాదని ఆ అధికారి చెప్పారు. వీలును బట్టి కార్యదర్శుల సమావేశం రెండు, మూడ్రోజుల్లోనే ఏర్పాటు చేసుకుందామని, ఆ తర్వాత ఉద్యోగుల విభజనపై ఓ అవగాహనకు వద్దామని తాము ప్రతిపాదించినా ఏపీ నుంచి సానుకూలత  వ్యక్తం కాలేదని సదరు అధికారి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement