క్వార్టర్‌ @ 300 | Lockdown Alcohol Sales in Vikarabad | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ @ 300

Published Tue, Mar 31 2020 7:54 AM | Last Updated on Tue, Mar 31 2020 7:54 AM

Lockdown Alcohol Sales in Vikarabad - Sakshi

వికారాబాద్‌ ,దోమ: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఇదే తమకు లక్కీ చాన్స్‌ అనుకుని బెల్టు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వైన్స్‌ మూసివేయడంతో వారు ధరలు పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. అసలే మద్యం లభించని ఈ సమయంలో దొరికింది అమృతంగా భావించి మద్యంప్రియులు కొనుగోలు చేస్తున్నారు. కొందరేమో ఆ ధరలను చూసి బెంబేలెత్తిపోతు న్నారు. వైన్స్‌ దుకాణాలు మూసి వేసి ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న బెల్టుషాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. ఎమ్మార్పీ కన్నా రెండు, మూడింతలు అధికంగా విక్రయిస్తూ మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

మద్యం దుకాణాల్లో రూ.120కి క్వార్టర్‌ ఉండగా ప్రస్తుతం గ్రామాల్లో రూ.300 నుంచి రూ.400కు లభిస్తోంది. దీంతో మద్యంప్రియులు తప్పని పరిస్థితుల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్యం దుకాణాదారులు ఒక దగ్గర దాచిఉంచి బెల్టు దుకాణాల నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం. అయితే వైన్స్‌ మూసి ఉండడంతో ఒక్కసారిగా బెల్టు దుకాణాల నిర్వాహకులు తమకు దొరికిందే అవకాశమని భావించి విక్రయాలను కూడా బాహాటంగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా దీన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సంబంధిత అధికారులతోపాటు మద్యం దుకాణాదారులు, బెల్టుషాపుల నిర్వాహకులు కుమ్మక్కు అయి ఈ దందా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం దుకాణాల మూతతో బెల్టు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది.  అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల ని ప్రజలు కోరుతున్నారు.

మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
బెల్టు దుకాణాల నిర్వాహకులు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఎక్కడైనా మద్యం విక్రయించినట్టు తెలిస్తే స్థానికులు ఆబ్కారీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. నిత్యం గ్రామాల్లో మద్యం విక్రయాలపై పర్యవేక్షిస్తున్నాం. మద్యం విక్రయించే వారిపై సమాచారం అందిస్తే అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తప్పవు.  – చంద్రశేఖర్, ఎక్సైజ్‌ శాఖ, పరిగి సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement