సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కొత్త సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్రంలో మొదలయ్యే ఎన్నికల కోలాహలం ఆరునెలలపాటు సాగనుంది. పంచాయతీ ఎన్నికలతో మొదలయ్యే రాజకీయ సమరం పార్లమెంటు ఎన్నికలతో ముగియనుంది. ముగిసిన శాసనసభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల పోరుపై ఆసక్తిగానే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మొదలై ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కానున్నాయి.
ఆ వెంటనే సహకార ఎన్నికలతోపాటు మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగియగానే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు... ఇవన్నీ అయిపోయాక లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయినా, కాకపోయినా పార్లమెంటు ఎన్నికలు మాత్రం అదే నెలలో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఎమ్మెల్యేలతోపాటు ఓడిన బాధలో ఉన్న నేతలు కూడా తమ భవిష్యత్ రాజకీయం కోసమైనా రాబోయే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.
సర్పంచులతో మొదలు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను గెలిపించుకోవడంతో గ్రామాల్లో బలం పెంచుకునే దిశగా తొమ్మిది స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఓడిన ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. గెలిచిన ఎమ్మెల్యేలు కదనోత్సాహంతో ఇప్పటికే ఆయా మండలాల్లో గ్రామాల వారీగా తమ గెలుపునకు సహకరించిన మాజీ సర్పంచులు, ఇతర నాయకులకు భరోసా ఇస్తున్నారు.
గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులతోపాటు వారి ప్రత్యర్థులు కూడా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతుండడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది. ఒక గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులుగా ఉన్న వారిలోనే ఎక్కువ మంది పోటీ పడితే ప్రత్యర్థి పార్టీ వర్గీయుడికి లాభం జరుగుతుందని ఆం దోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి నాయకుల ద్వారా ఆయా గ్రామాల్లో బలమైన నాయకుల వివరాలు తెప్పించుకొని గెలుపు గుర్రాలనే బరిలో నిలిపి, మిగతా వారిని సముదా యించాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. తాజా మాజీ సర్పంచులకు జెడ్‌పీటీసీ ఆశ చూపి, కొత్త వారికి అవకాÔశం ఇప్పించే పనిలో పలువురు ఎమ్మెల్యేలు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో ఓడిన అభ్యర్థులకే అవకాశం?
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులే పార్లమెంటు సీటు కోసం పోటీపడే పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ సీటు కోసం ఎస్టీ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివాసీ, లంబాడ వర్గాల్లో ఎవరికి సీటు లభిస్తుందనే దానిపైనే నేతల భవిష్యత్తు ఆధారపడింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనిల్‌జాదవ్, బోథ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపూరావుతో పాటు ఖానాపూర్‌లో ఓడిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా ఈసారి ఇక్కడ టికెట్టు ఆశిస్తున్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి కూడా శాసనసభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే మరోసారి లోక్‌సభ సమరంలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోర్లకుంట వెంకటేష్ నేత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ఉద్దేశంతో ఉన్నారు. కరీంనగర్‌లో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సుపరిచితుడిగా మారారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి పావులు కదుపుతున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిన ఆ జిల్లా మాజీ జెడ్‌పీ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఈసారి లోక్‌సభ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిన సానుభూతితోపాటు అప్పటికి మారే రాజకీయ పరిణామాలు కలిసి వస్తాయని ఆయన ధీమా.
గ్రామాలపై పట్టు కోసం ఓడిన కాంగ్రెస్ నేతలు
ఓటమి నుంచి తేరుకున్న కాంగ్రెస్ నాయకులు కూడా కార్యకర్తలతో సమావేశమవుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిస్తున్నారు. ఏయే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, ఎక్కడ దెబ్బతిన్నామని లెక్కలు చూసుకున్న నేతలు తదనుగుణంగా నమ్మకమైన వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మంచిర్యాలలో ప్రేంసాగర్ రావు, చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్ నేత, ముథోల్‌లో రామారావు పటేల్, ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాత, సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబు, బోథ్‌లో సోయం బాపూరావు ఇప్పటికే నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నాయకులకు స్వయంగా ఫోన్లు చేసి నిరుత్సాహపడవద్దని చెబుతూనే వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచులుగా ఎవరిని నిలపాలనే అంశాన్ని ద్వితీయ శ్రేణి నాయకులతో చర్చించి ఖరారు చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం జరిగే మునిసిపాలిటీ, సహకార, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దీటుగా అభ్యర్థులను ఎంపిక చేసి, విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చారు.
లోక్‌సభకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు సిద్ధం
స్థానిక ఎన్నికల తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ మళ్లీ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ టికెట్టు ఆశించి భంగపడ్డ ఆయన ఆ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. ఆయనతోపాటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ట్రాన్స్‌పోర్టు అధికారి శ్యాంనాయక్ సైతం టికెట్టు ఆశిస్తున్నారు.
శాసనసభ అభ్యర్థులను ప్రకటించిన తరహాలోనే అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తే నగేష్‌కే అవకాశం లభిస్తుంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ పోటీ చేయడం ఖరారైనట్టే. ఆయన కోసమే ఇక్కడ ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ను చెన్నూరు ఎమ్మెల్యేను చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టికెట్టు ఆశిస్తున్నప్పటికీ, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment