- ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పర్యటనపై భిన్నాభిప్రాయాలు
- వారం వ్యవధిలోనే జిల్లా సమీక్షలా?
- సమీక్షల్లో బయటపడుతున్న విభేదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్తలొల్లి మొదలైంది. ఈ నెలాఖరుతో పూర్తిచేయాల్సిన పార్టీ సభ్యత్వంపై అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించడంతో రాష్ట్రంలో భారీగా సభ్యులను చే ర్పించాలని రాష్ర్ట నాయకత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే దీనిపై పలు సమావేశాలు నిర్వహింది. వారం కిందట ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ టీపీసీసీ నాయకత్వంతో పాలు, డీసీసీ అధ్యక్షులతోనూ సమీక్ష జరిపారు.
కానీ, వారంరోజులు గడిచీ గడవక ముందే ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మరో మారు సమీక్ష జరిపేందుకు ఆదివారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రతిజిల్లాకు వెళ్లి సభ్యత్వ నమోదును పరిశీ లిస్తానని చెప్పడంతో టీపీసీసీ నాయకత్వం ఆయనను సోమవారం నిజామాబాద్‌కు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, అక్కడి నేతలు కుదరదనడంతో, విధిలేక మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గానికి కుంతియాను తీసుకు వెళ్లారు. సభ్యత్వ నమోదుకు ముప్పైరోజులే మిగిలి ఉండడంతో, సమీక్షలంటూ సమయం వృధాచేస్తే ఎలా అని కొందరు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.
సమీక్షల్లో బయటపడుతున్న విభేదాలు
సభ్యత్వాన్ని సమీక్షించే సమావేశాల్లో పార్టీ అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో, సభ్యత్వ పుస్తకాలు ఎవరిదగ్గర ఉండాలనే అంశంపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులకు గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వారం కిందట సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమీక్షలో దిగ్విజయ్‌సింగ్ సాక్షిగా రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది.
శనివారం గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్ నగర కాంగ్రెస్ సభ్యత్వ సమీక్ష సమావేశంలోనూ రెండువర్గాలు దాదాపు కొట్టుకున్నంత పనిచేశాయి. ఇప్పుడు మరోసారి జిల్లా సమీక్షలంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీటికి మండల కమిటీల అధ్యక్షులను, ఇతర నాయకులను పిలిచి సమావేశాలు పెట్టాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో రెండు మూడు గ్రూపులున్నాయి. సభ్యత్వ పుస్తకాల విషయంలోనే పలు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో సమీక్షల జోలికి వెళ్లకుంటే మేలనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.
పట్టువీడని కుంతియా...
సమీక్ష సమావేశాలు అక్కరలేదని కొందరు నేతలు కుంతియాతో చెప్పగా, ‘టీపీసీసీ నుంచి ఎవరు హాజరైనా, కాకున్నా, నేను ఒక్కడినైనా జిల్లాలకు వెళతా, సమీక్ష జరపుతా..’ అని మొండికేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకే కుంతియా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు. ఇక్కడి సభ్యత్వమంతా తన కనుసన్నల్లో జరిగిందన్న క్రెడిట్ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తం అవుతోంది.