
లండన్ అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి
లింగంపేట : ముస్తాపూర్ గ్రామానికి చెందిన ముక్కర అర్జున్‌రెడ్డి లండన్‌కు చెందిన హెలెన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన వీరి వివాహానికి హైదరాబాద్‌లోని గోల్డెన్ ఆర్కిడ్ రిసార్ట్స్ వేదికైంది. వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి 2009లో మాస్టర్ అఫ్ సైన్స్(ఎంఎస్) చదవడానికి లండన్ వెళ్లాడు.అక్కడ చదువుకుంటున్న సమయంలోనే హెలెన్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా ప్రేమగా మారింది. 2011లో చదువు పూర్తవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయినా ప్రణయం కొనసాగింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులూ పెళ్లికి అంగీకరించడంతో ఆదివారం రాత్రి పెళ్లి జరిపించారు.