అలా కలిశారు వారిద్దరూ.. | Love Bridge Puranapul Special Story | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌.. ప్రేమనగర్‌

Published Thu, Feb 14 2019 10:23 AM | Last Updated on Thu, Feb 14 2019 3:27 PM

Love Bridge Puranapul Special Story - Sakshi

ఓల్డ్‌ సిటీలోని పురానాపూల్‌ వంతెన, భాగమతి–కులీ కుతుబ్‌షా చిత్రం..

సాక్షి,సిటీబ్యూరో: ప్రేమ.. ఓ అందమైన భావన. మధురమైన అనుభూతి. వందల ఏళ్లుగా సాగుతున్న హృదయాల కావ్యం. హైదరాబాద్‌.. దశాబ్దాల కిందట ప్రేమ పునాదులపై వెలసిన ప్రేమనగరం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులు, భాషల పూదోటలు విరిశాయి. భాగమతి, కులీ కుతుబ్‌షాల్లాగే ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో ప్రేమ జంటలు ఈ వలపుల పూదోటలో విహరించాయి. భాగమతి–కులీ కుతుబ్‌షాల ప్రేమ ఘట్టం అపురూప కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత నిజాం కాలం నాటి బ్రిటిష్‌  రెసిడెంట్‌ కిర్క్‌ ప్యాట్రిక్, ఖైరున్నీసా  ప్రేమ కూడా అలాగే సాగింది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై  ఏకంగా ఒక ‘ప్రేమ వంతెన’ (పురానాపూల్‌) వెలిసింది. అప్పటికే పారిస్‌లోని సైనీ నదిపై నిర్మించిన ఫౌంట్‌న్యూఫ్‌  వంతెన తరహాలో దీన్ని నిర్మించడం విశేషం. ఇక కిర్క్‌ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమకు గుర్తుగా కోఠిలో ‘బ్రిటీష్‌ రెసిడెన్సీ’  వెలసింది. అందులోనే తన ప్రేయసికి కానుకగా ‘హవా మహల్‌’ను నిర్మించి ఇచ్చాడు ప్యాట్రిక్‌. హైదరాబాద్‌ అప్పుడు.. ఇప్పుడు ఓ ప్రేమనగరం. వాలంటైన్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం. 

అలా కలిశారు వారిద్దరూ..
‘చిచలం’ హైదరాబాద్‌ రాజ్యంలోని ఓ పల్లె ప్రాంతం.. మూసి నదికి ఆవలవైపు ఉంది. అపుడే గుర్రంపై ‘చిచలం’ చేరుకున్న   యువరాజు కులీ కుతుబ్‌షాకు ఎక్కడి నుంచో కాలి అందెల శబ్దం చెవులను తాకింది. ఆ సవ్వడిలో ఏదో గమ్మత్తును గుర్తించాడు. చూస్తే ఓ యువతి.. పేరు భాగమతి. పరవళ్లు తొక్కుతున్న మూసీ నదిలాగే అతడి హృదయంలో అలజడి రేగింది. ఆ రోజు ఆమె పల్లె పొలిమేరల్లో ఉన్న ఆలయానికి వెళ్తుండగా యువరాజు చూశాడు. ఆ యువతినే తన హృదయ సామ్రాజ్ఞిని చేసుకున్నాడు కులీ కుతుబ్‌షా. కానీ ఆమె సాధారణ యువతి. అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం. అతనిది మహ్మదీయ మతం. మరేం జరిగింది..?

ఏకం చేసిన ప్రేమ వంతెన..
హృదయాలు ఏకమైనా ఉప్పొంగే మూసీ వారి మధ్య అఖాతమైంది. ఆ దరి నుంచి ఈ దరికి చేరుకోకుండా అడ్డుపడింది. కానీ వారి ప్రేమ ముందు మూసీ ఓడిపోయింది. భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్‌. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు తండ్రి ఇబ్రహీం కుతుబ్‌ షా మూసీ నదిపై 1578లో కట్టించిన ‘ప్యార్‌ నా పూల్‌’ (పురానాపూల్‌) వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా నిలిచిపోయింది. పురానాపూల్, పారిస్‌లోని సైని నదిపై నిర్మించిన ఫాంట్‌న్యూఫ్‌ బ్రిడ్జీలు ఇంచుమించు ఒకే కాలంలో.. ఒకే నమూనాతో నిర్మించారు. మూసీనదికి ఉత్తరాన కుతుబ్‌ షా మొట్టమొదటిసారి భాగమతిని చూసిన ‘చిచలం’ వద్ద 1592 నాటికి అద్భుతమైన కట్టడం చార్మినార్‌తో నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఉన్న ఓ చిన్న పల్లె. దానినికి ‘భాగ్యనగర్‌’గా పేరుపెట్టారు. బహుశా మానవ చరిత్రలో ఇద్దరి ప్రేమకు చిహ్నంగా వెలిసిన నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. నగర నిర్మాణం నాటికి కుతుబ్‌ షా వద్ద మీర్‌ మోమిన్‌ ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఇరాన్‌కు చెందినవాడు కావడం వల్ల పర్షియాలోని ‘ఇస్పహాన్‌’ నగరం నమూనాలో హైదరాబాద్‌ నగరానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన వాస్తు శిల్పులను, నిపుణులను రప్పించారు. చరిత్రాత్మకమైన చార్మినార్‌కు నలువైపులా అందమైన ఉద్యానవనాలు, తటాకాలు, సరస్సులతో, రాజప్రముఖుల నివాస మందిరాలతో నగరం వెలసింది. లాల్‌మహల్, దాద్‌మహల్, జనాన మహల్, కుతుబ్‌ మందిర్, ఖుదాదత్‌ మహల్‌ వంటి అద్భుతమైన నిర్మాణాలన్నీ అప్పుడు కట్టించినవే.

కిర్క్‌ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమ ఘట్టం
భాగమతి, కుతుబ్‌షాల ప్రేమ ఘట్టంలాగే కిర్క్‌ ప్యాట్రిక్, ఖైరున్నీల ప్రేమ కూడా మధుర కావ్యమైంది. ప్యాట్రిక్‌ బ్రిటీష్‌ అధికారిగా వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సాంస్కృతిలో కలిసిపోయిన గొప్ప పరిపాలనాదక్షుడు. 1798 నుంచి 1805 వరకు హైదరాబాద్‌ 6వ రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి వరకు ఉన్న రెసిడెంట్లంతా  ‘షంషీద్‌జంగ్‌’ అనే అమీర్‌ తోటలో నివసించేవారు. కానీ మొదటిసారి ప్యాట్రిక్‌ ప్రత్యేకంగా ‘రెసిడెంట్‌ భవనం’ కట్టించాడు. నిజాం నవాబు సహకారంతో 64 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూసీకి ఉత్తరాన ఈ మహాసౌధం వెలిసింది. ఈ భవనానికి లండన్‌ నుంచి అత్యంత ఖరీదైన ఫర్నిచర్‌ తెప్పించాడు. తన రెసిడెంట్‌ భవనానికి కొద్ది దూరంలో.. సుల్తాన్‌బజార్‌లోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఖైరున్నీసా అనుకోకుండా ప్యాట్రిక్‌కు తారసపడింది. తొలి చూపులోనే ప్రేమించాడాయన. విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఇష్టపడింది. కానీ ఏంలాభం.. ఇద్దరి మతాలు.. భాషలు, ప్రాంతాలు వేరు. విషయాన్ని ఖైరున్నిసా కుటుంబ పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. ప్యాట్రిక్‌ తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన పేరును ‘హస్మత్‌ జంగ్‌ బహదూర్‌’గా మార్చుకుని ముస్లిం పద్ధతిలో తన ప్రేయసి ఖైరున్నిసాను 1803లో పెళ్లి చేసుకున్నాడు. నేటి కోఠి ఉమెన్స్‌ కళాశాల ప్రాంగణంలో ‘హావామహాల్‌’ను నిర్మించి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ జంట సుల్తాన్‌బజార్‌లో షాఫింగ్‌ చేసే వారు. వీరిది మతాంతర వివాహం కావడంతో ప్రజలు వీరి ప్రేమ గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement