చైతన్య ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంధ్య (ఇన్‌సెట్) బాధితురాలు సంధ్య
నేలకొండపల్లి: అతడొక ఆర్‌ఎంపీ. ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ వైద్యం చేస్తుంటాడు. ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెతో పరిచయం స్నేహం పెంచుకున్నాడు. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. చాలా ‘దగ్గర’య్యాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. గుడిలో రహస్యంగా పెళ్లాడాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత... వద్ద పొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె... అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామ యువకుడైన బొయిన చైతన్య, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా అతనితో అందరూ చనువుగా ఉండేవాడు.
మూడేళ్ల క్రితం, అదే గ్రామంలోని డిగ్రీ విద్యార్థిని గొడుగు సంధ్యపై కన్నేశాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. ‘మనిద్దరం స్నేహితులమ’న్నాడు. ఆమె తలూపింది. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ ‘దగ్గర’య్యారు. గత ఏడాది, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తన ఫోన్ లో వేద మంత్రాల ఆడియో ఆన్ చేసి తాళి కట్టాడు. ఆమె గర్భవతయింది.
అతడే అబార్షన్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ చెట్టపట్టాలేసుకసుని, పట్టపగ్గాల్లేకుండా తిరిగారు. గత నెల 21న బైక్‌పై జగ్గయ్యపేట వెళుతున్న వీరిద్దరిని ఆమె బంధువులు చూశారు. ఆమె ఇంటోళ్లకు తెలిసింది. వారు అతడిని నిలదీశారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. అప్పటి నుంచి అతడు బలుసుపాడులో ప్రాక్టీస్ మానేశాడు. ఆమెను పట్టించుకోవడం లేదు. ‘నీ దారిన నువ్వు వెళ్లు. నాతో ఉండొద్దు. వెళ్లిపో...’ అంటున్నాడు. దీంతో, ఆమె ఆదివారం సాయంత్రం తన కుటుంబీకులతో కలిసి చైతన్య ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను భార్యగా స్వీకరించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. చైతన్య, అతడి కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఆమె నుంచి వివరాలను ఎస్సై ఎన్.గౌతమ్ తెలుసుకున్నారు.
న్యాయం జరిగేంత వరకు పోరాడతా... అంటోంది సంధ్య. ‘‘నన్ను నమ్మించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు, మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాను. చైతన్యకు, నాకు.. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేయించాలి’’ అని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment