
ప్రేమ.. సహజీవనం.. మరో యువతితో పెళ్లి
ఖమ్మం : ఓ యువతిని ప్రేమించాడు.. ఇద్దరూ సహ జీవనం చేశాడు. గర్భవతి అయిన ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి యువకుడు మొహం చాటేశాడు. దాంతో ఆ యువతి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోడానికి తనకు కొంత సమయం కావాలని అతగాడు కోరాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. మరోవైపు ఓ యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. సమాచారం అందుకున్న ప్రియురాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన ప్రవీణ్ కుమార్.. హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఖమ్మానికి చెందిన ఓ యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి, సహజీవనానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఆమెతో పెళ్లికి ప్రవీణ్ కుమార్ సాకులు చెపుతూ కాలయాపన చేయటంతో బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదైంది.
దాంతో అతడు వివాహానికి కొంత సమయం కావాలని కోరి, అనంతరం మణుగూరుకు మకాం మార్చాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు, బంధువులు శనివారం పెళ్లి వేదిక వద్దకు చేరుకుని ప్రవీణ్ కుమార్పై చేయి చేసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి వైపు బంధువులంతా జుట్లు జుట్లు పట్టుకుని తెగ కొట్టుకున్నారు.