
జోషి, నయోమి
శంషాబాద్: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం తో పోలీసులను ఆశ్రయించడానికి బయలుదేరిన ఓ జంట మార్గమధ్యలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొయినాబాద్ మండలం ఎల్కగూడకి చెందిన జోషి(21) అదే మండలం చిల్కూరుకు చెందిన నయోమి(22) ప్రేమించుకుంటున్నారు.
ఇటీవల నయోమికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో వెంటనే పెళ్లి చేసుకుందామని జోషిపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో శనివారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మార్గమధ్యలో జోషి మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని నయోమితో చెప్పాడు.
ఈ విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అసహనంతో జోషి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో నయోమి కూడా అతడిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరికీ మంటలంటుకున్నాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.