
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నాగులు
ఖైరతాబాద్/అఫ్జల్‌గంజ్: తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ రవీంద్రభారతి రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి కూతవేటు దూరంలోని రవీంద్రభారతి సమీపంలో ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీదకు వచ్చిన వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాగులు అనే ఆ వ్యక్తి ఒంటిపై మంటల్ని ఆర్పారు. ఆ వెంటనే అతడిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 63 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు (55) చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పాల్గొనడమే కాకుండా ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నాడు.
చాలా కాలం కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. నాగులు కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్ ఇద్దరూ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఈసీఐఎల్ పరిధిలోని బండ్లగూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. నాగులు బంజారాహిల్స్ రోడ్‌నం–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కాగా, అతను గురువారం ఉదయం ఓ బాటిల్‌లో పెట్రోల్ పోయించుకొని రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా.. అది ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వమే తన కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకోవాలని నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇదిలా ఉండగా నాగులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అతడి శరీరం దాదాపు 62 శాతం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయని, తెలంగాణ కోసం తన ప్రాణం కూడా ఇస్తానని అనేవాడని నాగులు భార్య స్వరూప తెలిపింది. పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ఉస్మానియాలో గాలిన గాయాలతో ఉన్నాడని చెప్పగానే తట్టుకోలేక పోయానని స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తకు మంచి చికిత్స అందించాలని కోరింది. తన భర్త తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని తరచూ బాధ పడేవాడని, తమ కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
మంత్రి ఈటల వాకబు..
అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారని, నాగులుకు మెరుగైన చికిత్స అందించాలని తనకు సూచించారని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment