
రామోజీ ఫిలింసిటీని దున్నటం ఏమైంది?
సీఎం కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్న
కరీంనగర్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లు కట్టి దున్నిస్తామన్న కేసీఆర్ హెచ్చరికలు ఏమయ్యాయని కరీంనగర్, నిజామాబాద్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న కేసీఆర్ మాటమార్చడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహం కార ధోరణికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.