హైకోర్టుకు ‘మిస్టరీ’ రిపోర్ట్..!
- సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు మధుకర్ రీ పోస్టుమార్టం నివేదిక
- పోలీసుల దర్యాప్తు నివేదిక కూడా
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహం రీ పోస్టుమార్టం నివేదిక సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు చేరింది. ఫోరెన్సిక్ రిపోర్ట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ నివేదిక కూడా హైకోర్టుకు చేరింది. మార్చి 14న అనుమానాస్పదరీతిలో ఖానాపూర్ శివారులో మృతిచెందిన మధుకర్ మృతిపై సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారమైంది. మధుకర్ మృతిపై రీ పోస్టుమార్టం జరపాలని అతడి తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల 10న ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు న్యాయమూర్తి, పోలీసు విచారణాధికారి, మంథని తహసీల్దార్, మధుకర్ తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో రీపోస్టుమార్టం జరిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలను వైద్య నిపుణులు న్యాయమూర్తికి అందజేశారు. 2.05 గంటల నిడివి గల పోస్టుమార్టం వీడియోను 6 సీడీలలో నిక్షిప్తం చేసిన పోలీసులు న్యాయమూర్తికి అందజేశారు. అక్కడి నుంచి సీల్డ్‌కవర్‌లో నివేదికలన్నీ 2 రోజుల క్రితం హైకోర్టుకు చేరాయి.
పూర్తయిన పోలీసుల విచారణ
మధుకర్ మృతిపై విచారణాధికారిగా నియమితులైన పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ తన దర్యాప్తును పూర్తిచేసినట్టు సమాచారం. మధుకర్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారం తర్వాత వారిని వదిలేశారు. మధుకర్ ప్రేమించిన యువతి తండ్రిని, యువతిని, కుటుంబసభ్యులను విచారించారు. గోదావరిఖని న్యాయమూర్తి సమక్షంలో ఏసీపీ సింధూశర్మ ఆ యువతి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో దాదాపు 70మందిని ఆమె విచారించారు. దర్యాప్తు చేస్తున్నంత సేపు వీడియో రికార్డింగ్ చేయించినట్టు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికనూ కోర్టుకే అందజేసినట్టు తెలిసింది.
జూన్‌లో వీడనున్న మిస్టరీ
వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో మధుకర్ కేసును హైకోర్టు విచారించనుంది. మధుకర్ మృతదేహం రీపోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలను, పోలీసుల దర్యాప్తు నివేదికలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించి, మధుకర్ మృతి మిస్టరీని వెల్లడించనున్నారు.