‘హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం’
సాక్షి, పెద్దపల్లి/మంథని: అనుమానాస్పదరీతిలో మృతిచెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ రీ–పోస్టుమార్టమ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. పెద్దపల్లిలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
సిట్టింగ్ జడ్జి, ఫోరె న్సిక్ నిపుణుల సమక్షంలో రీ–పోస్టుమార్టమ్ జరపాలని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారని, వారికి ఎక్కడా అడ్డు చెప్పలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా మెడికల్ కళాశాలకు లేఖ రాసి రీ–పోస్టుమార్టమ్‌కు ప్రాసెస్‌ను మళ్లీ మొదలు పెడతామని చెప్పారు. మధుకర్ మృతి కేసును నిష్పాక్షికంగా ఐపీఎస్ అధికారి సింధూశర్మ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
పోలీసులపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు విశ్వాసం ఉంచి సహకరిం చాలని కోరారు. మధుకర్ కేసులో పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అభిప్రా యాలను వీడియో కవరేజ్ మధ్య వివరాలు రాబట్టారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలోనే విచారణ కొనసాగింది.