మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాదిగలను అంటరానివారిగా చూస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దొరతనంతో ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను బర్తరఫ్ చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా ఎస్సీలను తొక్కిపట్టిన కేసీఆర్ ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను జీర్ణించుకోలేక ఆయనపై రుసరుసలాడుతూ చివరికి బర్తరఫ్ చేశారని ఆరోపించారు.
కులవివక్షత ఎక్కడో లేదని కేసీఆర్ వద్దే అది కనిపిస్తోందన్నారు. వరంగల్ సభలో తనకన్నా ముందే హెల్త్ యూనివర్సిటీపై రాజయ్య ప్రకటన చేసినప్పటి నుంచి ఆయనను మందలించడం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ ఉంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు.