మంజీర నదిలో ఇసుక దోపిడీ
మంజీర నదిలో ఇసుక దోపిడీ
Published Fri, Mar 3 2017 12:07 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
► మహారాష్ట్ర అనుమతులతో జిల్లా భూభాగంలో తవ్వకాలు
► ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోతరచూ ఉద్రిక్త పరిస్థితులు
నిజామాబాద్ :
మంజీర నదిలో మహారాష్ట్ర మాయగాళ్లు దోపిడీ చేస్తున్నారు. మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరిట నదిలో సరిహద్దులు దాటి జిల్లా భూభాగంలోకి చొచ్చుకు రావడం ఏటా పరిపాటిగా తయారైంది. రాత్రికి రాత్రి జిల్లా భూభాగంలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ మన వనరులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోయి.. జరగాల్సిన నష్టం జిల్లాకు జరిగిపోతుండగా.. ఇసుకపై ఆదాయం మాత్రం మహారాష్ట్ర సర్కారుకు వెళ్తోంది. నదిలో సరిహద్దుల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఇరు రాష్ట్రాల సరిహద్దుల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏటా మహారాష్ట్ర కాంట్రాక్టర్లు జిల్లా భూభూగంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇటీవల శాఖాపూర్ (మహారాష్ట్ర) క్వారీ పేరిట కోటగిరి మండలం సుంకిని గ్రామ భూభాగంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో గ్రామస్తులు వెళ్లి ఈ తవ్వకాలను నిలిపేయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా శాఖల అధికారులు వెళ్లి ఇసుక తవ్విన జేసీబీని సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మహారాష్ట్రలోని శాఖాపూర్ క్వారీ అనుమతి పేరిట సుంకిని గ్రామశివారులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగినట్లు జిల్లా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు గుర్తించారు. ఇలా మహారాష్ట్ర క్వారీల పేరిట తవ్వుతున్న ఇసుకను తెలంగాణలోని వివిధ పట్టణాలకే తరలించి కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు.
వట్టి పోతున్న పథకాలు
తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ప్రవహించే మంజీరకు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్‌గాం, బిక్‌నెల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలో పలు ఎత్తిపోతల పథకాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాధారంగా ఉన్న ఈ ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి.
దీంతో ఈ గ్రామాల వాసులకు ఎండా కాలంలో కనీసం తాగునీరు కూడా దొరక్క పడరాని పాట్లు పడ్డారు. నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలతో సరిహద్దు గ్రామాల్లో బోర్లు వట్టిపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. మహా మాయగాళ్ల ఆగడాల కారణంగా ఎన్నో దుష్ఫలితాలను అనుభవించామని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు వాపోతున్నారు.
క్వారీలకు అనుమతులు
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా మంజీర నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. సుమారు 12 ఇసుక క్వారీలకు ఈ సారి నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈ క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మంజీరను సరిహద్దులు దాటి కొల్లగొడుతున్నారు.
Advertisement