వందల మైళ్ల దూరం.. గంటల తరబడి ప్రయాణం.. రైలెక్కాలంటేనే బోర్ అనుకుంటున్నారా.. ఇక నుంచి అలాంటి ఇబ్బందేమీ ఉండదు. రైలు ప్రయాణంలో ఎలాంటి బోర్ ఫీల్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంచక్కా నచ్చిన పాటలు వినొచ్చు. సినిమాలతో కాలక్షేపం చేయొచ్చు. పిల్లలైతే కార్టూన్‌లతో హ్యాపీగా గడిపేయొచ్చు. నిజమే. ఇప్పుడు ప్రయాణికుల కోసం వినోదాల రైలుబండి వచ్చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటిసారి దీనికి శ్రీకారం చుట్టింది. కాచిగూడ నుంచి బెంగళూర్ మధ్య రాకపోకలు సాగించే కాచిగూడ– బెంగళూర్ (12785) ఎక్స్‌ప్రెస్‌లో ఇక నుంచి అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంటుంది.
‘మ్యాజిక్ బాక్స్’ద్వారా ఈ వినోదాన్ని ప్రయాణికులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రైలులోని 5 ఏసీ కోచ్‌లలో 6 మ్యాజిక్ బాక్సు పరికరాలను అమర్చారు. ఢిల్లీకి చెందిన మెసర్స్ ఎస్‌ఆర్ మూవింగ్ టాకీస్ అనే సంస్థ రైళ్లలో మొట్టమొదటిసారి వీటిని పరిచయం చేసింది. ఇప్పటికే ఈ బాక్సులు ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలో అందుబాటులో ఉన్నాయి. తాజాగా కాచిగూడ– బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దీన్ని ప్రారంభించారు. – సాక్షి, హైదరాబాద్
ఇంటర్నెట్ అవసరం లేదు..
ఈ మ్యాజిక్ బాక్సు ద్వారా ప్రయాణికులు ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే తమ సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో వినోదాన్ని ఆస్వాదించవచ్చు. 500 గంటల నిడివి కలిగిన వినోద కార్యక్రమాలను ఇందులో ఉంచారు. ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సినిమాలు, పాటలు, వివిధ రకాల కార్యక్రమాలు వీక్షించవచ్చు. వైఫై ద్వారా కనెక్ట్ అయితే వినోదాల ప్రవాహం ముంచెత్తుతుంది. అలాగే రైల్వే కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. విజ్ఞానాన్ని పెంపొందించుకొనే కార్యక్రమాలు కూడా ఉంటాయి.
మ్యాజిక్ బాక్సు ఇలా పొందవచ్చు..
►సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫై ఆప్షన్ ఎంచుకోవాలి.
►అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లలో ‘మ్యాజిక్ బాక్సు’కనెక్ట్ చేయాలి.
►కనెక్షన్ వచ్చిన తరువాత బ్రౌజర్ విండో పైన ‘మ్యాజిక్ బాక్స్ డాట్ కామ్’అని టైప్ చేయాలి.
►మ్యాజిక్ బాక్స్ ప్రారంభించేందుకు బొటన వేలి ముద్రను క్లిక్ చేయాలి.
►కంటెంట్ యాక్సెస్ కోసం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
► అంతే ఇక నచ్చిన కార్యక్రమాలను వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment